పీకే, క్రిష్‌ మూవీ నెంబర్‌ మారనుందా?

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రంగా వకీల్‌ సాబ్‌ తెరకెక్కింది. షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. కరోనా లాక్‌ డౌన్‌ అడ్డు రాకుండా ఉంటే ఇప్పటి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. ఈ ఏడాది చివరి వరకు వకీల్‌ సాబ్‌ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక పవన్‌ 27వ చిత్రం ఏంటీ అంటే క్రిష్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం అని అందరు అంటారు. ఇప్పటికే విరూపాక్ష అనే టైటిల్‌ ను కూడా సినిమాకు అనుకుంటున్నట్లుగా ప్రచారం జరిగింది.

కరోనా కారణంగా భారీ చిత్రాల సినిమాలు షూటింగ్‌ చేయలేని పరిస్థితి. విరూపాక్ష భారీ పీరియాడిక్‌ చిత్రం అవ్వడంతో చాలా మంది నటీనటులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుందట. ఎక్కువ సీన్స్‌ ఔట్‌ డోర్‌లో చిత్రీకరణ చేయాల్సి ఉందట. ఈ పరిస్థితుల్లో సినిమా షూటింగ్‌ సాధ్యం కాకపోవచ్చు అనే నిర్ణయానికి మేకర్స్‌ వచ్చారు. దాంతో షూటింగ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

క్రిష్‌ మూవీ ఆలస్యం అవుతున్న కారణంగా పవన్‌ 28వ చిత్రం అనుకున్న హరీష్‌ శంకర్‌ మూవీని ముందే ప్రారంభించాలని భావిస్తున్నారట. వకీల్‌ సాబ్‌ పూర్తి అయిన వెంటనే పవన్‌ 27వ చిత్రంగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో సినిమా చేయనున్నారట. ఇప్పటికే హరీష్‌ శంకర్‌ కూడా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేశాడు. హరీష్‌ శంకర్‌ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌లో క్రిష్‌ కూడా పాల్గొన్నాడు. ఇద్దరి మద్య మంచి అవగాహణ ఉన్న కారణంగా మొదట హరీష్‌ శంకర్‌ మూవీ ఆ తర్వాత క్రిష్‌ మూవీ తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు.