జనసేనాని పవన్‌ ఫొటోల మార్ఫింగ్: ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంత.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ‘సనాతన ధర్మం’ గొప్పతనాన్ని చాటుతూ ఒక రోజు దీక్షకు దిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపం వెలిగించాలని పిలుపునిస్తూ, ఆయన పిలుపు మేరకు లక్షలాది మంది తమ ఇళ్ళల్లో దీపం వెలిగించారు.. పరమత సహనాన్ని చాటారు కూడా.

అయితే, ఈ క్రమంలో జనసేన అధినేతకు సంబంధించిన కొన్ని ఫొటోల్ని వైసీపీ మద్దతుదారులతోపాటు, టీడీపీ మద్దతుదారులు కూడా సోషల్‌ మీడియాలో మార్ఫింగ్ చేశారు. ఈ వ్యవహారంపై జనసేన నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్‌ స్టేషన్లలో పిర్యాదులు చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలపై సోషల్‌ మీడియాలో మార్పింగ్‌ చేసిన ఫొటోల్ని చేసినా, అసభ్యకర కామెంట్లు చేసినా రాత్రికి రాత్రి అరెస్టుల పర్వానికి తెరలేపుతున్న పోలీసులు, జనసేన అధినేత ఫొటోల మార్ఫింగ్ విషయమై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

‘చట్టం అందరికీ ఒకేలా పనిచేయడంలేదు. అధికార పార్టీకి ఒకలా, విపక్షాలకు ఇంకోలా పనిచేస్తోంది..’ అంటూ ఇప్పటికే పోలీసులపై చాలా విమర్శలున్నాయి. అధికార పార్టీ నుంచి ఫిర్యాదులు అందితే, అత్యంత వేంగా స్పందిస్తున్న పోలీసు యంత్రాంగం, జనసేన కావొచ్చు.. ఇతర విపక్షాలు కావొచ్చు.. ఏ విషయమ్మీద ఫిర్యాదు చేసినా పట్టించుకపోవడం లేదన్న విమర్శల నేపథ్యంలో పోలీసులు ఇకనైనా చిత్తశుద్ధితో స్పందిస్తారా.? లేదా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

నిజానికి గతంలోనూ పలుమార్లు జనసేన తరఫున పోలీసులకు ఫిర్యాదులు వెళ్ళాయి. కానీ, వేటిల్లోనూ పోలీసులు చర్యలు తీసుకోలేదు. మరి, ఈసారేం చేస్తారో.! అసలు రాష్ట్రంలో అందరికీ ఒకే చట్టం అమలవుతోందా.? లేదా.? ఈ విషయమై మళ్ళీ న్యాయస్థానాలు మొట్టికాయలేసేదాకా పోలీసు వ్యవస్థ ఎదురుచూస్తుందా.? అన్న విమర్శ జనసేన శ్రేణుల నుంచి ప్రముఖంగా వినిపిస్తోంది.