వ్యవస్థలకు పవన్-పూరి ప్రశ్న.. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’కు 8 ఏళ్లు

సినిమాకు ప్రేక్షకులకు వినోదం ఇవ్వడమే కాదు.. సమాజంలోని సమస్యలను, వ్యవస్థల్లోని లోపాలను ప్రశ్నిస్తూ ప్రజలను చైతన్యపరిచే శక్తి కూడా ఉంది. ఇలా నిరూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వీటికి స్టార్ పవర్ తోడైతే సంచలనం సృష్టిస్తాయి.. మంచి సినిమాగా ప్రేక్షకుల మన్ననలు పొందుతాయి. ఈకోవలోకి వచ్చే సినిమానే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. బద్రి తర్వాత పవన్-పూరి కాంబినేషన్లో మరో సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్, ఇండస్ట్రీ కూడా ఎదురుచూసింది. అందరి అంచనాల మధ్య ఈ సినిమా అక్టోబర్ 18, 2012న విడుదలైంది.

వినోదం కంటే సమాజాన్ని జాగృతి చేసే సినిమాల స్థాయికి వీరిద్దరూ ఎదిగిపోయారు. ఆ నేపథ్యంలోనే సామాన్యుడి కోపం, జర్నలిజం పవర్, వ్యవస్థల్లోని లోపాల్ని ప్రశ్నిస్తూ ఈ సినిమాను తెరకెక్కించాడు పూరి. సామాన్యుడిగా, జర్నలిస్టుగా పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షోతో సినిమా స్థాయి పెరిగింది. పూరి తనదైన స్టయిల్లో డైలాగ్స్, స్క్రీన్ ప్లే, టేకింగ్ తో సినిమాను పవర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. పవన్ ఆలోచనలకు తగ్గట్టే కథ ఉండటంతో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా నిలిచింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో మణిశర్మ మ్యాజిక్కే చేశాడు.

యూనివర్శల్ మీడియా బ్యానర్ పై డీవీవీ దానయ్య, రాధాకృష్ణ కలిసి ఈ సినిమా నిర్మించారు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా.. పైగా పూరి దర్శకుడు కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఫ్యాన్స్ అంచనాలు అందుకోవడంలో కాస్త తడబడిందనే చెప్పాలి.