జల్లికట్టులోకి.. కోడిపందేల్ని తీసుకొచ్చిన పవన్

సంస్కృతికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో పక్కనున్న తమిళుల్ని చూసి తెలుగులోళ్లు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టుపై సుప్రీం విధించిన నిషేధంపై తమిళులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమిళనాడు మొత్తం ఇప్పుడు జల్లికట్టు బ్యాన్ పై అగ్గి ఫైర్ అవుతున్న వేళ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.

ఎప్పుడూ ఇలాంటి విషయాల మీద రియాక్ట్ కాని మహేశ్ బాబు.. జల్లికట్టుకు తన మద్దతును ప్రకటించగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి పవన్ కల్యాణ్ చేరిపోయారు. మహేశ్ తో పోలిస్తే.. పవన్ మరో అడుగు ముందుకు వేశారు. తమ సంప్రదాయక్రీడ అయిన జల్లికట్టు మీద తమిళులు విప్పిన గళానికి మద్దతు ఇచ్చిన పవన్.. పనిలో పనిగా ఆంధ్రుల సంప్రదాయ క్రీడ అయిన కోడి పందేల గురించి ప్రశ్నలు సంధించారు.

జల్లికట్టు.. కోడి పందేలను నిషేధించటం భారత ప్రభుత్వం ద్రవిడుదల సంస్కృతి.. సంప్రదాయాలపై దాడి చేయటమేనని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్ సందర్భంగా.. ఆంద్రాప్రాంతంలో జరిగిన కొన్ని రాజకీయ సమావేశాల తర్వాత ‘నిషేధం’ ప్రజల్ని ఎంత వేదనకు గురి చేస్తుందన్నవిషయం తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా పవన్ ఆసక్తికర వాదనను వినిపించారు. ‘ప్రభుత్వం జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేధించింది. నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశ వ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్.. బీఫ్ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు. తన ఫాంహౌస్ లో ఉన్న 16కు పైగా ఆవులు.. కోడిపుంజులు.. దక్షిణ భారతంలోనిజల్లికట్టు.. కోడిపందేలపై విధించిన నిషేధం గురించి తనను ఆలోచించేలా చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై తమిళులు ఏకతాటిగా నిలబడి.. తమ మూలాల కోసం పోరాడుతున్న వేళ.. పవన్ ఫైరింగ్ ట్వీట్లు ఏం చెబుతున్నాయో ఆంధ్రులకు అర్థమయ్యే అవకాశం ఉందా?