ప‌వన్‌తో విద్యార్థులు…ఆ మంత్రిపై జ‌న‌సేనాని ఆగ్ర‌హం

విద్యారంగంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టిసారించారు. భావి భార‌త పౌరులైన విద్యార్థుల‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో జాప్యం చేయ‌కూడ‌ద‌ని కోరారు. యూనివ‌ర్సిటీల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ కోరారు. నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థులు త‌న‌ను క‌లిసిన సంద‌ర్భంగా ప‌వ‌న్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నెల‌కొన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొంటూ అందుకు నిరసనగా విద్యార్థుల బృందం పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు కాలినడకన నెల్లూరు నుంచి బయలుదేరారు. వారంతా విజయవాడ వరకు రాగానే కొందరు అస్వస్తతకు గురయ్యారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విద్యార్థుల సమస్యను తెలుసుకుని చలించిన పవన్… వారందర్నీ హైదరాబాద్‌ రావాల్సిందిగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో కాటమరాయుడు సినిమా షూటింగ్‌ లొకేషన్‌లో వారంద‌రినీ పవన్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా విశ్వవిద్యాలయంలో ఇబ్బందులను విద్యార్థులు పవన్‌కు వివరించారు. విద్యాలయంలో నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని, తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని విద్యార్థులు జొన్నలగడ్డ సుధీర్‌,  గంగిరెడ్డిలు పవన్‌కు తెలిపారు. విద్యాలయంలో అక్రమాలపై పత్రికల్లో కథనాలు, పరిశోధించి రూపొందించిన నివేదికలను పవన్‌కు అందజేశారు.

విద్యార్థుల సమస్యలపై పవన్ స్పందించారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ విద్యార్థులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం పాద‌యాత్రగా వ‌చ్చే ప‌రిస్థితులు రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఆ యూనివ‌ర్సిటీలో నెల‌కొన్న‌ సమస్యల పరిష్కారానికి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నెల్లూరు వర్సిటీ సమస్యలపై దృష్టిసారించాలని పవన్ కల్యాణ్ కోరారు.