చిరుని చూసి నేర్చుకో ‘తమ్ముడూ’

రాజకీయ రంగంలో అనుకున్న రీతిన విజయవంతం కాలేదేమో కానీ సినీ రంగానికి వచ్చే సరికి చిరంజీవి మకుటం లేని మహరాజు. కేవలం ఎలాంటి కథలు జనాన్ని మెప్పిస్తాయనేదే కాకుండా ఏ తరహాలో తనని తాను ప్రెజెంట్‌ చేసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది చిరంజీవికి బాగా తెలుసు. ఇంతగా మాస్‌ పల్స్‌ తెలిసిన హీరో ఇంకొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

హీరో ఎప్పుడూ ప్రెజెంటబుల్‌గా వుండాలని, షేపవుట్‌ అయిపోయినట్టు కనిపించరాదని సినిమాటోగ్రాఫర్స్‌తో మాట్లాడి ఏ యాంగిల్‌లో చూపించాలో కూడా ఆయనే సూచిస్తుంటారు. ఫలానా యాంగిల్‌లో తన లుక్‌ బాగోదనిపిస్తే వీలయనంత వరకు అది అవాయిడ్‌ చేయిస్తారు. కేవలం తెర మీదే కాకుండా తెర వెనుక కూడా చిరంజీవి తన లుక్స్‌ పరంగా చాలా కేర్‌ఫుల్‌గా వుంటారు. ఖైదీ నంబర్‌ 150 చిత్రాన్నే చూస్తే అరవై ఒక్క ఏళ్ల వయసులో అంత గ్లామరస్‌గా కనిపించడం చిరంజీవికే చెల్లు అనిపించేట్టు కనిపించారు. ఈ విషయాల్లో పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడూ పట్టనట్టే వుంటాడు.

కథల ఎంపికలోను పవన్‌ అజాగ్రత్త ఎప్పటికప్పుడు కనిపిస్తూనే వుంటుంది. తన ఇమేజ్‌కి అనుగుణంగా కాస్త వినోదం వుండేట్టు చూసుకుంటే పవన్‌ సినిమాలు పాస్‌ అయిపోతాయి. కానీ దర్శకుల ఎంపిక దగ్గర్నుంచి అన్నిట్లోను పవన్‌ కేర్‌లెస్‌గా వ్యవహరిస్తుంటాడనేది ఫాన్స్‌ కంప్లయింట్‌. ఈమధ్య తన లుక్‌ పరంగా కూడా కేర్‌ తీసుకోవడం లేదని, అరవయ్యేళ్ల చిరంజీవి కంటే పెద్ద వయసువాడిలా కనిపిస్తున్నాడని కామెంట్స్‌ పడుతున్నాయి.