‘పెళ్లిచూపులు’ దర్శకుడికి మండిపోయింది

పెళ్లిచూపులు.. గత ఏడాది పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్టయిన సినిమా. కథాకథనాలు.. డైలాగులు.. నటన.. సంగీతం.. అన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తూ.. మన ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచిన సినిమా. కమర్షియల్ గానూ పెద్ద సక్సెస్ అయిన ఈ చిత్రంపై పొరుగు భాషల వాళ్లూ ఆసక్తి చూపించారు. గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తున్నాడు. హిందీలో వశు భగ్నాని లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఈ చిత్ర హక్కులు తీసుకున్నాడు. ఐతే ఇంత మంచి పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి అవార్డులేవీ రాలేదు.

ఈ సినిమా విడుదలయ్యాక హైదరాబాద్ లో తెలుగు సినిమాలకు సంబంధించి రెండు అవార్డు వేడుకలు జరిగాయి. కానీ వీటిలో ‘పెళ్లిచూపులు’కు గుర్తింపు దక్కలేదు.
దీనిపై దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు మండిపోయింది. అవార్డుల తీరును దుయ్యబడుతూ అతను ఫేస్ బుక్‌లో ఒక పోస్టు పెట్టాడు. అవార్డుల్లో స్టార్ హీరోలు.. పెద్ద సినిమాలకే పెద్ద పీట వేస్తున్నారంటూ అతను తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘పెళ్లిచూపులు’ లాంటి సినిమాను గుర్తించకపోవడంపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను తన ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో కూడా స్టార్లు.. మార్కెట్ డిమాండ్లకు తలొగ్గనని అతను పెద్ద స్టేట్మెంటే ఇచ్చాడు.

తరుణ్ భాస్కర్ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. గత ఏడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘పెళ్లిచూపులు’ ముందుంటుంది. తరుణ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడి ఉంటాడో.. ఎన్ని అడ్డంకుల మధ్య ఇలాంటి మంచి సినిమాను తీశాడో అర్థం చేసుకోవచ్చు. తెలుగు సినిమాను ఒక సరికొత్త మార్పు దిశగా నడిపించిన ఇలాంటి సినిమాలకు కాకుండా స్టార్లకే పెద్ద పీట వేస్తూ అవార్డులివ్వడం విచారకరమే.