ఆ డైరెక్టర్ వెర్సస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌

‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ అనవసర వివాదంలో చిక్కుకున్నాడు. ఎన్టీఆర్ అభిమానులకు అతను టార్గెట్‌గా మారాడు. తాను తీసిన ‘పెళ్లిచూపులు’ సినిమాకు ‘ఐఫా’ అవార్డుల్లో ఒక్క పురస్కారం కూడా దక్కకపోవడంపై తరుణ్ భాస్కర్ ఇంతకుముందు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే ఇటీవలే ‘పెళ్లిచూపులు’ సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి.

ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇంతకుముందు ఐఫా అవార్డుల విషయమై తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశాడు తరుణ్. తాను ఇండస్ట్రీకి కొత్త అని.. ఇక్కడి వ్యవహారాలపై తనకు అవగాహన లేదని అన్నాడు తరుణ్.

ఈ అవార్డుల విషయమై తనకు ఫోన్ చేసి కొందరు క్లారిటీ ఇచ్చారని అతనన్నాడు. తన లాంటి కొత్త దర్శకులకు అవార్డులిస్తే.. జనాలు చూడరని.. టీఆర్పీలు రావని.. కాబట్టి ఎన్టీఆర్ లాంటి హీరోల సినిమాలకు అవార్డు ఇస్తే అన్ని రకాలుగా వర్కవుట్ అవుతుందని తనకు వివరణ ఇచ్చినట్లు అతను చెప్పాడు. దీంతో టీఆర్పీ కోసమే ‘జనతా గ్యారేజ్’కు అవార్డు ఇచ్చారని తరుణ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. ఒక్క హిట్టుకే ఇంత పొగరా.. మా ఎన్టీఆర్‌ను అంటావా అంటూ అతడి మీద విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా తరుణ్ భాస్కర్ వికీపీడియా పేజీలోకెళ్లి.. తరుణ్ చనిపోయినట్లుగా ఎడిట్ చేసి.. స్క్రీన్ సేవర్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు పరిస్థితి తీవ్రతను గమనించిన తరుణ్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెబుతూ.. ఓ లెంగ్తీ ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు.