కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.. సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాని తన సందేశం వినిపించారు. ఈ సమయంలో వారిపై హింస, కించపరిచే ఘటనలకు పాల్పడితే క్షమించేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు రావడానికి మూడు అంశాలు కీలకమని అన్నారు.

ఇండియా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (భారత జాతీయ పోషకాల కార్యక్రమం) ద్వారా పిల్లలు, వారి తల్లులకు ఎలాంటి సాయం అందిందో ప్రధాని ప్రస్తావించారు. 2025 కల్లా దేశంలో క్షయ రోగాన్ని పూర్తిగా తరిమికొట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా మిషన మోడ్ ఇంప్లిమెంటేషన్ అత్యంత అవసరం అన్నారు. దీని గురించ వివరిస్తూ.. ఓ ఆలోచన వస్తే దాన్ని వెంటనే పేపర్‌పై పెట్టాలని అన్నారు. దాన్ని అంతే సమర్థంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా అద్భుతాలు చేయొచ్చన్నారు. ఇందుకోసం మూడు అంశాలపై దృష్టిసారించాలని మోదీ పిలుపునిచ్చారు.

ఇందులో మొదటి అంశం.. టెలి మెడిసిన్‌లో ఆధునికత, విప్లవాత్మక మార్పుల్ని తీసుకురావడం ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు.

రెండో అంశంగా.. ఆరోగ్య రంగంలో మేకిన్ ఇండియాను బలంగా తీసుకెళ్లాలని అన్నారు. ఈ రంగంలో తొలిదశలో తెచ్చిన ఫలితాలు తమ అంచనాల్ని పెంచాయన్నారు మోదీ. దేశీయంగా కోటి PPE కిట్లను తయారు చేసి కరోనా వారియర్లకు అందించడం విశేషమన్నారు.

మూడో అంశంగా.. ఆరోగ్యంలో ఐటీ విభాగ సేవలు అందుబాటులోకి రావడం శుభపరిణామన్నారు. ఆరోగ్య సేతు యాప్ ను12 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకోవడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. దేశంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందనడానికి ఇదే నిదర్శనమన్నారు. కరోనాతో పోరాడేందుకు ఆరోగ్య సేతు బాగా ఉపయోగపడుతోందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.