ప్రభాస్ ‘ఆదిపురుష్‌’ విడుదల తేదీ కన్ఫర్మ్

ప్రభాస్‌ బాలీవుడ్‌ మూవీ ఆదిపురుష్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది నేషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక వైపు అయోద్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంటే మరో వైపు ఈ సినిమా రూపొందుతున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అంటూ దర్శకుడు ఓం రౌత్‌ అంచనాలను మరింతగా పెంచుతున్నాడు. సినిమా షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా ప్రకటించిన సమయంలోనే 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామంటూ నమ్మకంగా చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని మరింత స్పష్టంగా అధికారికంగా క్లారిటీ ఇవ్వడంతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

నిన్న ఆదిపురుష్‌ నుండి కీలక ప్రకటన రాబోతుంది అంటూ అనౌన్స్‌మెంట్‌ రావడంతో అంతా కూడా హీరోయిన్‌ విషయమై క్లారిటీ ఇవ్వబోతున్నారేమో అనుకున్నారు. కాని అనూహ్యంగా విడుదల తేదీని ప్రకటించాడు. ఎప్పటి మాదిరిగానే ఉదయం 7.11 ముహూర్తానికి విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఆదిపురుష్‌ ను 11.08.2022 తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. దాదాపుగా 20 నెలల సమయం ఉంది. 500 కోట్ల బడ్జెట్‌ అంటున్న నేపథ్యంలో ఇంత తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదల చేయగలరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దర్శకుడు ఓం రౌత్‌కు ఒక పక్కా క్లారిటీ అనేది ఉంటుంది. ఆయన ఎప్పటిలాగే తాను అనుకున్నట్లుగా సినిమాను ముందుకు తీసుకు వెళ్తూ అద్బుతమైన విజువల్‌ వండర్‌ గా సినిమాను తెరకెక్కించబోతున్నాడు. సినిమా షూటింగ్‌ పార్ట్‌ కేవలం అయిదు ఆరు నెలల్లోనే పూర్తి అవ్వబోతుంది. కాని విజువల్‌ ఎఫెక్ట్స్‌ వర్క్‌ ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఏడాది సమయం దానికి కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రభాస్‌ కెరీర్‌ లో మరో సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.