మహేష్ కోసం పూరి అంత కష్టపడిపోయాడా?

వారం రోజుల్లో కథ రాసేస్తా.. రెండు వారాల్లో డైలాగ్ వెర్షన్ సహా స్క్రిప్టు రెడీ అయిపోతుంది అని చెబుతుంటాడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన సినిమాలు బాగా ఆడుతున్నపుడు ఈ ముచ్చట్లు బాగానే ఉండేవి. అంత వేగంగా స్క్రిప్టు రాసేస్తాడు అని జనాలు ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో ఇవే మాటల్ని పూరి రిపీట్ చేస్తుంటే మాత్రం జనాలకు చిరాకు పుడుతోంది.

ఎందుకంటే ఆయన నుంచి వస్తున్న సినిమాలు అలా ఉంటున్నాయి మరి. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్ లాంటి సినిమాల కథల్ని వారంలో రాస్తే ఏంటి.. ఒక్క రోజులో రాస్తే ఏంటి అన్నది జనాల వాదన. ఈ ఫ్రస్టేషన్ పూరి వరకు చేరినట్లుంది. అందుకే ఆయన వారం.. రెండు వారాల మాటలు మాట్లాడట్లేదు.

మహేష్ బాబు కోసం ఓ కథ రాయడానికి రెండు నెలల సమయం తీసుకున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి జగన్నాథ్. ఆ కథే.. ‘జనగణమన’ అట. తన కెరీర్లో ఓ కథ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నది దీని కోసమే అంటున్నాడు పూరి. ఎంతో ఇష్టంతో ఈ కథ రాశానని పూరి చెప్పాడు. కానీ పాపం పూరి అంత సమయం పెట్టి కథ రాసినా మహేష్ బాబు ఆయన్ని కనికరించలేదు.

పూరి పాటికి పూరి ట్విట్టర్లో ఈ సినిమాను అనౌన్స్ చేసేయగా.. మహేష్ మాత్రం పచ్చజెండా ఊపలేదు. వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు. మహేష్ తనకు ఎస్ ఆర్ నో ఏదీ చెప్పకపోవడంపై ఆ మధ్య ‘ఇజం’ ప్రమోషన్ల సందర్భంగా అసహనం వ్యక్తం చేశాడు పూరి. కానీ ఆ సినిమాతో పాటు ‘రోగ్’ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో పూరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మహేష్ సినిమా మీద ఆశతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి.. 2018లో మహేష్ సినిమాను పట్టాలెక్కించాలని కోరుకుంటున్నాడు. బాలయ్య సినిమా అయ్యాక స్క్రిప్టును మరింత బాగా తీర్చిదిద్దుకుని మహేష్‌ను కలవాలని చూస్తున్నాడు.