గురువు సినిమా ఫట్.. శిష్యుడు సినిమా సూపరట

మొన్న సంక్రాంతికి టాలీవుడ్ ప్రముఖు హీరోలైన చిరంజీవి.. బాలకృష్ణలకు చెందిన ల్యాండ్ మార్క్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా రెండు చిత్రాల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి పందెం కోళ్ల తరహాలో వీరిద్దరి సినిమాల మధ్య పోటీ నడిచింది. తాజాగా బాలీవుడ్ లోఇలాంటి సీన్ తాజాగా ఆవిష్కృతమైంది.

రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందుగా బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూక్ ఖాన్.. హృతిక్ రోషన్ల సినిమాలు రయిస్.. కాబిల్ చిత్రాలు విడుదలయ్యాయి. దాదాపు ఏడాది క్రితమే పూర్తి అయిన రయిస్ ను.. ఎట్టకేలకు విడుదల చేయగా.. సరిగ్గా తమ సినిమా విడుదల టైంలోనే రిలీజ్ చేయటంపై హృతిక్ ఫ్యామిలీ గుర్రుగా ఉంది.

ఈ ఇద్దరి ప్రముఖుల సినిమాలు ఒకేసారి థియేటర్లకు రావటంతో వీరిద్దరి మధ్య పోరు తప్పనిసరైంది. ఇదిలా ఉంటే.. తాజాగా హృతిక్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. తనకు పోటీగా నిలిచిన షారూక్ ను గురువుగా పేర్కొంటూ.. తాను శిష్యుడిగా చెప్పుకొచ్చారు. ఇరువురి సినిమాలు ఒకేసారి విడుదల కావటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. హృతిక్ తండ్రి.. కాబిల్ నిర్మాత అయిన రాకేశ్ రోషన్ మాత్రం షారూక్ నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారట. తమసినిమాకు పోటీగా రయిస్ విడుదల చేయటంతో తాము రూ.150కోట్లు నష్టపోయినట్లుగా ఆయన చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఇద్దరి సినిమాలకు సంబంధించిన రివ్యూలు వచ్చేశాయ్. రయిస్ సినిమా ఏ మాత్రం బాగోలేదన్న టాక్ వినిపిస్తోంది.దీనికి తగ్గట్లే వివిధ మీడియా సంస్థలు రెండు.. రెండున్న స్టార్లను సరిపెడితే.. కాబిల్ కు మాత్రం అందుకు భిన్నంగా పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ సినిమాకు త్రీ స్టార్ కుపైనే రేటింగ్ ఇవ్వటం.. ఎక్కువమంది ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వటం కనిపిస్తోంది. చూస్తుంటే.. గురువు సినిమా ఫట్ మంటే.. శిష్యుడి సినిమా మాత్రంచెలరేగిపోతోందన్న మాట వినిపిస్తోంది. బాలీవుడ్ బాద్షాకు ఇది కాస్త ఇబ్బంది కలిగించే సమాచారమే.