ఏపీలో వైసీపీ క్రిస్టియనైజేషన్‌.! ఈ ఆరోపణల్లో నిజమెంత.?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘క్రిస్టియనైజేషన్‌’ దిశగా అడుగులు వేస్తోందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఏ ప్రభుత్వమూ ఓ మతానికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితి మామూలుగా అయితే వుండదు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాంటూ ఇటీవల కేంద్రానికి ఓ లేఖాస్త్రం వెళ్ళింది. హిందూ క్రిస్టియన్లకు ఈ కన్వర్టెడ్‌ క్రిస్టియన్ల ద్వారా సమస్యలు వచ్చిపడుతున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదులు రాష్ట్రం నుంచి వెళుతున్న విషయం విదితమే.

చాలామంది క్రిస్టియానిటీలోకి కన్వర్ట్‌ అయినా, తమను తాము హిందువులుగానే రికార్డుల్లో పేర్కొంటున్నారు. పలువురు ప్రజా ప్రతినిథుల విషయంలోనూ ఈ తరహా ఆరోపణలున్నాయి. ఇక, తాజాగా వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు, ‘క్రిస్టియనైజేషన్‌ వ్యవహారం’పై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారట. అందులో క్రిస్టియన్‌ పాస్టర్లకు 5 వేల రూపాయల సాయం సహా పలు కీలక అంశాల్ని పేర్కొన్నారట రఘురామకృష్ణరాజు.

2011 లెక్కలప్రకారం రాష్ట్రంలో 1.8 శాతం క్రిస్టియన్లు వున్నారనీ, ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుందని తన లేఖలో పేర్కొన్నారట రఘురామకృష్ణరాజు. ఈ ఆరోపణని ఆయన కొన్నాళ్ళ క్రితం మీడియా సాక్షిగా కూడా చేయడం గమనార్హం. వాలంటీర్లను ఉపయోగించి, పాస్టర్ల వివరాల్ని సేకరించి, వారికి పెద్దయెత్తున ప్రభుత్వం ‘లబ్ది చేకూర్చే’ చర్యలు చేపడుతోందనీ, ఇందుకు కలెక్టర్ల వ్యవస్థనూ వినియోగిస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు.

కాగా, గడచిన ఏడాది కాలంలో ఏకంగా 33 వేల చర్చిలు కొత్తగా రాష్ట్రంలో నిర్మితమయ్యాయనీ.. ఇదంతా చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం, క్రిస్టియనైజేషన్‌కి మద్దతిస్తున్నట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్లు జెరూసలెం వెళ్ళేందుకు వీలుగా ఆర్థిక సాయాన్ని 40 వేల నుంచి 60 వేలకు పెంచడం పట్ల కూడా రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఒక్కటి మాత్రం నిజం.. క్రిస్టియన్లకీ, ముస్లింలకీ ఈ తరహా ‘ఆఫర్లు’ ఇస్తున్న ప్రభుత్వాలు, హిందువులు పవిత్ర పుణ్యక్షేత్రాలుకు వెళితే మాత్రం టిక్కెట్ల రూపంలో దోపిడీకి గురవుతున్నారన్న ఆవేదన హిందూ సమజంలో వుంది.