ఇన్ సైడ్ టాక్: రఘురాముడిపై వేటుకి వేళయిందా?

ఏపీలో అధికార వైఎస్సార్ పార్టీ పక్కలో బల్లెంలా తయారైన ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వేటు వేయించడానికి రంగం సిద్దమవుతోందా? ఈ అంశాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఇప్పటికే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించేలా చేసిన వైసీపీ.. వేటు విషయంలోనూ పావులు కదుపుతోందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.

ఇప్పటికే ఆయన అనర్హతకు సంబంధించి లోక్ సభ స్పీకర్ కు పిటిషన్ ఇవ్వగా.. అది పెండింగ్ లోనే ఉంది. ఆయన పార్టీకి, ప్రభుత్వానికి ఎన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా పార్టీపరంగా చర్య తీసుకునే సాహసాన్ని వైసీపీ చేయలేకపోతోంది. దీంతో పార్టీలో చాలాచోట్ల లుకలుకలు పెరిగాయి. వర్గ, ఆధిపత్య పోరుతో చాలాచోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మొన్న విశాఖలో సాయిరెడ్డి, నిన్న కాకినాడలో సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి వ్యవహారం.. ఇలా చాలా అంశాలు అధిష్టానానికి ఇబ్బందిగా మారింది. ఇలాంటి వ్యవహారాల్లో అధినేత జగన్ సైతం సరిగా వ్యవహరించడంలేదని విమర్శలు పెరిగాయి. విశాఖ, కాకినాడ ఘటనల్లో వారిని పిలిపించి వివరణ తీసుకోవడం మినహా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇది ఒకరకంగా పార్టీలో తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.

ఇప్పటికే రఘురాముడి వ్యవహారంలో ఏమీ చేయలేకపోతున్నామనే ఆవేదన వారందరిలో నెలకొంది. ఈ క్రమంలో ఆయనపై వేటు వేయించడం ద్వారా పార్టీలో అసమ్మతివాదులందరికీ హెచ్చరిక పంపాలన్నది పార్టీ ఉద్దశంగా చెబుతున్నారు. అందువల్ల ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని రఘురాముడిపై వేటు వేయించే దిశగా కదులుతున్నట్టు సమాచారం.

పార్టీ తనను ఏమీ చేయలేదని ఇప్పటికే పలుమార్లు రఘురామ కృష్ణంరాజు సవాల్ కూడా చేశారు. దీంతో ఎలాగైనా ఆయనపై వేటు వేయించి తిరుపతితో పాటు నరసాపురం లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నరసాపురంలో రఘురామ కృష్ణం రాజు వర్గానికే చెందిన మరో కీలక నేతను పార్టీలోకి ఆహ్వానించింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజుకి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. మరి రఘురాముడిపై వేటు వేయించే విషయంలో వైసీపీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.