ఇప్పుడా భారమంతా జక్కన్నపైనే

షూటింగ్ లు ఆగిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. సినిమా మీదే ఆధారపడి జీవించే దాదాపు 12 వేల మందికి ఇప్పుడు పూట గడవడం కూడా కష్టంగానే ఉంటోంది. అందుకే చిరంజీవి, నాగార్జున మరియు ప్రముఖ దర్శకులు, నిర్మాతల నేతృత్వంలో కొంత మంది తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామంత్రిని కలిసి షూటింగ్ లు త్వరగా మొదలుపెట్టాలని విన్నవించుకున్నారు.

ఒక్కోదానికి రిలాక్సేషన్ ఇస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లను కూడా అనుమతించాలని కోరారు. అయితే ప్రభుత్వానికి మాత్రం ఈ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. నిత్యం వందల మంది ఒక చోట చేరి పని చేసే చోట ఇప్పుడు సామాజిక దూరం పాటించడం ఎంత వరకూ అవుతుందోనన్న అనుమానాలు వారికీ ఉన్నాయి.

అయితే దీనికి జక్కన్న ఒక సొల్యూషన్ సూచించాడు. సినిమాల్లో చాలా వరకూ సన్నివేశాలకు వందల మంది అవసరం లేదని, కొద్దిమందితో షూటింగ్ కానివ్వచ్చని, ముందుగా తక్కువ మంది అవసరం ఉండే సీన్లను చిత్రీకరించుకుంటామని, డిసెంబర్ తర్వాత భారీ సీన్లను చిత్రీకరిస్తామని తెలిపాడు.

అలాగే ఒక రోజంతా షూటింగ్ ఎలా జరుగుతుందో టెస్ట్ షూట్ లా చేసి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తామని, దాంతో కనుక సంతృప్తి చెందితే షూటింగ్ లకు అనుమతి ఇవ్వమని అన్నాడు. దీనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అంగీకరించినట్లు సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా కనుక షూటింగ్ ను తక్కువ మందితో కొనసాగించగలిగితే మిగతా సినిమాలకు కూడా ఇబ్బంది ఉండదు. సో ఇప్పుడు భారమంతా జక్కన్నపైనే ఉంది.