ప్రభాస్ ఏం సాధించాడో చెప్పిన జక్కన్న

నాలుగేళ్ల కిందట ప్రభాస్ ఒక తెలుగు హీరో. కానీ ఇప్పుడు అతను ఇండియన్ హీరో. సౌత్-నార్త్.. తెలుగు-హిందీ అని తేడా లేకుండా అన్ని చోట్లా అతను సూపర్ పాపులారిటీ సంపాదించాడు. ఇదంతా ‘బాహుబలి’ పుణ్యమే. ప్రభాస్‌కు ఇలాంటి ఇమేజ్ తెచ్చిపెట్టినందుకు గర్వంగా ఉందంటున్నాడు దర్శకుడు రాజమౌళి. నేషనల్ లెవెల్లో ప్రభాస్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక ఉదాహరణ చెప్పాడు రాజమౌళి.

‘‘బాహుబలి: ది కంక్లూజన్ ట్రైలర్ కోసం ముంబయికి వెళ్లాం. ప్రెస్ మీట్ పెట్టాం. అది జరుగుతున్న హాల్లోకి వెళ్లబోతున్నాం. ప్రభాస్ ఎంటరయ్యాడో లేదో ఒకటే అరుపులు.. ఒకటే గోల. అక్కడేమీ సామాన్య జనాలు లేరు. ఉన్నదంతా మీడియా వాళ్లే. మామూలుగా మీడియా వాళ్లు అలా అరవరు. దీన్ని బట్టే ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో ఎలాంటి ఇమేజ్ వచ్చిందో.. అతడి ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభాస్ పడ్డ నాలుగేళ్లకు పైగా పడ్డ కష్టానికి నేను ఇలాంటి ఫలితాన్ని అందించినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘బాహుబలి’ కోసం క్రియేటివ్‌గా ఎంతైనా చేసి ఉండొచ్చు. కానీ నా హీరోకు ఇలాంటి ఇమేజ్ తీసుకొచ్చినందుకు ఒక కమర్షియల్ డైరెక్టర్‌గా చాలా గర్వంగా ఉంది. ‘బాహుబలి’తో ప్రభాస్ ఏం సాధించాడు అంటే ఇదే చెబుతాను. అది నాకు అత్యంత ఆనందాన్నిచ్చిన విషయం’’ అని రాజమౌళి తెలిపాడు.