రాజమౌళి క్రిష్కు ఇచ్చిన సలహా..

గత కొన్నేళ్లలో బాలీవుడ్ వాళ్లు కూడా సాహసించని మెగా ప్రాజెక్టులతో అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. ముఖ్యంగా ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్ను ఓ రీజనల్ డైరెక్టర్ చేయగలడని ఎవరూ ఊహించలేదు. కానీ రాజమౌళి అద్భుతాన్ని ఆవిష్కరించి ఎంతోమంది దర్శకులకు స్ఫూర్తినిచ్చాడు. అలా స్ఫూర్తి పొందిన దర్శకుల్లో క్రిష్ కూడా ఒకడని చెప్పొచ్చు.

క్రిష్ తీసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ‘బాహుబలి’ స్థాయి సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఐతే ‘బాహుబలి’ కోసం రాజమౌళి అన్నేళ్లు కష్టపడితే.. క్రిష్ కొన్ని నెలల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని పూర్తి చేయడాన్ని ప్రస్తావిస్తూ జక్కన్న మీద సెటైర్లు వేస్తున్నారు కొందరు. ఐతే ఇప్పుడు క్రిష్ మాటలు చూస్తే శాతకర్ణికి జక్కన్న చేసిన సాయమేంటో తెలుస్తుంది.

”నేను రాజమౌళికి గౌతమీపుత్ర శాతకర్ణి పూర్తి కథ చెప్పాను. ఆయన నాకో గొప్ప సలహా చెప్పారు. అదేమిటంటే కథ ఫాంటసీ కాదు.. నిజంగా జరిగిందే కాబట్టి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎక్కువగా వాడకుండా సహజంగా సినిమా తీయమని.. అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ తక్కువ సమయంలో.. తక్కువ ఖర్చుతో పూర్తవుతుందని చెప్పారు. నేను కూడా అలాగే చేశా. అందువల్లే ఈ సినిమాను అనుకున్న సమయంలో, బడ్జెట్లో పూర్తి చేయగలిగాం” అని క్రిష్ చెప్పాడు.

‘బాహుబలి’ ఫాంటసీ సినిమా కాబట్టి దాన్ని రూపొందించడానికి చాలా సమయం పట్టిందని.. ఐతే శాతకర్ణి వాస్తవ చరిత్ర కాబట్టి సినిమా తీయడానికి పెద్దగా టైమ్ పట్టలేదంటూ రెండు సినిమాల మధ్య తేడాను క్రిష్ స్పష్టంగా చెప్పాడు. క్రిష్ ఎనిమిది నెలల్లోనే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని పూర్తి చేయడంపై రాజమౌళి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.