ఇప్పటికీ తగ్గని మ్యూజికల్ ఫ్లేవర్.. రామ్ చరణ్ ‘ఆరెంజ్’కు 10 ఏళ్లు

‘హిట్ అయినవి మంచి సినిమాలూ కాదూ.. ఫ్లాప్ అయినవి చెడ్డ సినిమాలూ కాదు’ అని అంటూంటారు. కొన్ని ఫ్లాప్ సినిమాల్లో కంటెంట్, సన్నివేశాలు, ఫైట్లు, పాటలు.. ఇలా ఏదొక అంశం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి. కమర్షియల్ సక్సెస్ అవ్వవు. ఈకోవలోకి వచ్చే సినిమానే ‘ఆరెంజ్’. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు నేటితో 10 ఏళ్లు పూర్తయ్యాయి. ‘మగధీర’తో సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ వెంటనే చేసిన సినిమా ‘ఆరెంజ్’.

నవంబర్ 26’ 2010న విడుదలై ఫ్లాప్ అయిన సినిమా గురించి చెప్పుకునేంత ఏముందీ.. అంటే.. ‘పాటలు’ అని చెప్పాలి. హ్యారిస్ జైరాజ్ సంగీతంలోని పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఆరెంజ్ పాటల్లోని ఫ్లేవర్ పోలేదనే చెప్పాలి. మ్యూజికల్ గా చార్ట్ బస్టర్ అయింది. సినిమాలో విజువలైజేషన్ కూడా అంతే ఆకట్టుకుంటుంది. ఆస్ట్రేలియా లొకేషన్లలో కలర్ ఫుల్ గా తెరకెక్కించిన పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. ప్రేమకథల్లో సూపర్ హిట్లు, ‘ఖుషి’ వంటి ఇండస్ట్రీ హిట్ ఉన్న తెలుగు సినిమాల్లో మ్యూజికల్ వండర్ చేసిన ఆరెంజ్ ఫ్లాప్ అయింది.

బొమ్మరిల్లు భాస్కర్ కథలో అడ్వాన్స్డ్ కల్చర్ కు.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొంచెం మార్చలేకపోవడం.. స్క్రీన్ ప్లేపై మరికాస్త శ్రద్ధ… రన్ టైమ్.. ఇలాంటి కొన్ని అంశాలపై దర్శకుడు దృష్టి పెట్టుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేదని ఫ్యాన్స్ ఇప్పటికీ భావిస్తారు. ఇప్పటికీ ఆరెంజ్ పాటలకు ఫేవరేట్స్ ఉన్నారు. పాటలపరంగా ఆ ఫ్లేవర్ ఇప్పటికీ పోలేదు. బడ్జెట్ కంట్రోల్ లేకపోవడంతో నిర్మాత నాగబాబుకు ఆర్ధికంగా నష్టం చేసింది. #DecadeForCultClassicORANGE అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం.