బాహుబ‌లికి.. ఘాజికి మ‌ధ్య అంత క‌ష్టం

సినిమాల కోసం లుక్ మార్చుకునే విష‌యంలో ఇప్ప‌టి హీరోల క‌మిట్మెంట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ‘దంగ‌ల్’ సినిమా కోసం ఆమిర్ ఖాన్ ఎంత‌గా ట్రాన్స్‌ఫామ్ అయ్యాడో అంద‌రూ చూశారు. మ‌న రానా ద‌గ్గుబాటి కూడా ఆ కోవ‌కే చెందుతాడు.

బాహుబ‌లి సినిమా కోసం అత‌ను ఎలా త‌యార‌య్యాడో తెలిసిందే. ‘బాహుబ‌లిః ది బిగినింగ్’ కంటే కూడా ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ కోసం మ‌రింత‌గా బాడీ పెంచాడు రానా. ఈ సినిమా షూటింగ్ మ‌ధ్య‌లోనే ‘ఘాజీ చిత్రీక‌ర‌ణ‌లోనూ పాల్గొన్నాడు రానా. మ‌రి రెంటికీ లుక్ విష‌యంలో ఎలా తేడా చూపించాడు.. అందుకోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడు.. అత‌డి మాట‌ల్లోనే తెలుసుకుందాం ప‌దండి.

‘‘బాహుబ‌లి, ఘాజీ భిన్న‌మైన సినిమాలు. నా లుక్ కూడా భిన్నంగా ఉంటుంది. బాహుబ‌లి-2 పూర్తి కాకుండానే ఘాజీలో న‌టించాల్సి వ‌చ్చింది. బాహుబ‌లి-2 ఒక షెడ్యూల్ అవ‌గానే ‘ఘాజీ’ షూటింగ్‌కి వెళ్లాల్సి వ‌చ్చింది. చాలా త‌క్కువ స‌మ‌యంలో 15 కిలోలు త‌గ్గాను. అంత‌కుముందు రోజుకు తొమ్మిదిసార్లు భోంజేసేవాడిని. త‌ర్వాత నాలుగు భోజ‌నాల‌కు త‌గ్గించా. నాన్ వెజ్ మానేశా. ప్రొటీన్ ఫుడ్ త‌గ్గించా. దీంతో లుక్ మారింది. ఇలా త‌క్కువ రోజుల్లో బ‌రువు పెర‌గ‌డం.. త‌గ్గ‌డం వ‌ల్ల ఆరోగ్యం మీద చాలా ప్ర‌భావం ప‌డుతుంది. ఐతే నిపుణుల స‌ల‌హాతో ఇబ్బంది రాకుండా చూసుకున్నా. ఘాజీ సినిమాకు కొన్ని షెడ్యూళ్లు చేశాక తిరిగి ‘బాహుబ‌లిః ది కంక్లూజ‌న్’ షూటింగుకి వెళ్లా. మ‌ళ్లీ ఒక‌ప్ప‌టి డైట్..ట్రైనింగ్ తీసుకున్నా’’ అని రానా తెలిపాడు.