లేదు లేదంటూనే వాయిదా వేసేశాడు

అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ గురించి ఈ మధ్య అనేక రూమర్లు వినిపించాయి. ఈ సినిమా ఫైనల్ ఔట్ పుట్ మీద నిర్మాత నాగార్జున సంతృప్తిగా లేడని.. మార్పులు చేర్పులు జరుగుతున్నాయని.. సినిమా అనుకున్నట్లుగా మే 19న విడుదల కాదని.. వాయిదా పడుతుందని అన్నారు.

ఐతే నాగార్జున ట్విట్టర్లో ఈ ప్రచారాన్ని ఖండించాడు. కానీ చివరికి తేలిందేంటంటే.. ఈ సినిమా 19న రావట్లేదు. ‘రారండోయ్..’ను అధికారికంగానే వాయిదా వేశారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా వెల్లడైంది. ఆ పాట వీడియో చివర్లో మే 26న రిలీజ్ అని ప్రకటించేశారు.

మరి సినిమా వాయిదా పడింది కాబట్టి సినిమాకు రీషూట్లు జరగడం వాస్తవమే అనుకోవాలేమో. త్వరలోనే ఆడియో వేడుక లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ చేసి.. చక్కగా ప్రమోషన్ అదీ చేసి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాడు నాగ్. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల రూపొందించిన సినిమా ఇది. చైతూ సరసన రకుల్ ప్రీత్ నటించింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. మే 19 నుంచి ‘రారండోయ్..’ వాయిదా పడటంతో 19న రాబోతున్న ‘కేశవ’కు లైన్ క్లియర్ అయినట్లే.

ఆ సినిమాపై మంచి అంచనాలున్నాయి. చైతూ సినిమాతో పోటీగానే సినిమాను రిలీజ్ చేసేయడానికి నిర్మాత రెడీ అయ్యాడంటే దాని మీద ఉన్న కాన్ఫిడెన్సేంటో అర్థం చేసుకోవచ్చు. ‘స్వామిరారా’ తర్వాత సుధీర్ వర్మ-నిఖిల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది.