కాటమరాయుడు అస్సలు తగ్గట్లేదు

ఒక హీరో సినిమా ఒకటి అట్టర్ ఫ్లాప్ అయినా ఆ ప్రభావం అతడి తర్వాతి సినిమా మీద పడకపోయినపుడు అతను నిజమైన స్టార్ అనిపించుకుంటాడు. ఇలాంటి స్టార్లు చాలా అరుదుగా ఉంటారు. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడు. ఒక దశలో దాదాపు దశాబ్దం పాటు నిఖార్సయిన హిట్టు లేకపోయినా పవన్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ‘గబ్బర్ సింగ్’తో మళ్లీ వసూళ్ల మోత మోగించాడు. ఆపై మళ్లీ బ్రేకులు పడ్డా.. ‘అత్తారింటికి దారేది’ సినిమాతో తిరిగి రికార్డుల పని పట్టాడు. దాని తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పెద్ద డిజాస్టర్ అయినా ఆ ప్రభావం ఏమీ ‘కాటమరాయుడు’ మీద పడకపోవడం విశేషం. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో రూ.85 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం.

తాజా సమాచారం ప్రకారం ‘కాటమరాయుడు’ శాటిలైట్ హక్కులకు కూడా మాంచి రేటే పలికిందట. జెమిని టీవీ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని విడుదలకు ముందే రూ.12.5 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఒక పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా పవన్ సినిమాకు ఇంత రేటు పలకడమంటే మామూలు విషయం కాదు. పైగా ఈ మధ్య శాటిలైట్ బిజినెస్ బాగా డల్లయింది. సినిమా విడుదలకు ముందే అగ్రిమెంట్లు కుదరడం తగ్గిపోయింది.

ఇలా భారీ రేట్లకు హక్కులు తీసుకుని తర్వాత దానికి తగ్గ ఆదాయం రావట్లేదని.. టీవీ ఛానెళ్లు దూకుడు తగ్గించాయి. సినిమా విడుదల తర్వాత రిజల్ట్ చూసి హక్కులు తీసుకుంటున్నాయి. ‘కాటమరాయుడు’ విషయంలో ముందు అంత హైప్ లేకపోవడంతో టీవీ ఛానెళ్లు సైలెంటుగా ఉన్నాయి కానీ.. దీని టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం.. సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ రావడంతో అలెర్టయ్యాయి. పోటీని తట్టుకుని జెమిని టీవీ హక్కుల్ని సొంతం చేసుకుంది.