ముగ్గురు డైరెక్టర్ల చేతుల్లో రెజీనా..

విజయాలు లేక విలవిల్లాడుతున్న రెజీనాకి ఇప్పుడు ఒక హిట్టు కావాలి. చేసిన ప్రతి సినిమా మిస్‌ఫైర్‌ అవుతూ వుంటే ఇప్పటికే తనపై ఐరెన్‌లెగ్‌ ముద్ర వేసేసారు. పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, వచ్చిన వాటితో సంతృప్తి పడుతూ బండి లాగుతోన్న రెజీనా సక్సెస్‌ లేకుండా ఎక్కువ కాలం నెట్టుకురావడం కష్టమే.

అందుకే ఇప్పుడు తన తలరాతని మార్చే సినిమా కోసం ఆమె ఎదురు చూస్తోంది. సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో చేస్తోన్న తమిళ చిత్రం ‘నెన్‌జమ్‌ మారప్పతిళ్లయ్‌’ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. సెల్వ రాఘవన్‌కి వున్న కల్ట్‌ ఫాలోయింగ్‌ ఈ చిత్రాన్ని కచ్చితంగా హిట్‌ చేస్తుందని ఆమె నమ్ముతోంది. ఈ చిత్రాన్ని మరో టాప్‌ డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌ నిర్మిస్తూ వుండడం విశేషం.

హారర్‌ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోగా మరో స్టార్‌ డైరెక్టర్‌ ఎస్‌.జె. సూర్య నటిస్తుండడం మరో విశేషం. ముగ్గురు దర్శకులు కలిసి చేస్తోన్న సినిమాగా తమిళ మీడియాలో ఈ చిత్రానికి మంచి కవరేజ్‌ దక్కింది. ఈ పాటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా విడుదల కాకపోవడం రెజీనాని బాధిస్తోంది. రెండుసార్లు రిలీజ్‌ వాయిదా పడడంతో ఆమె ఒకింత టెన్షన్‌ పడుతోంది.

గౌతమ్‌ మీనన్‌ నిర్మించే సినిమాలన్నిటికీ ఈ పురిటి కష్టాలు మామూలే కనుక విడుదలలో మరికొంత జాప్యం జరగవచ్చు. ఈ సినిమా రిలీజ్‌ అయి రెజీనా కోరుకుంటోన్న బ్రేక్‌ ఇస్తుందా లేక రిలీజ్‌ అవకముందే స్టేల్‌ అయిపోతుందా అనేది చూడాలి.