లాక్ డౌన్ టైమ్ లో వర్మ ఎందుకు షూట్ చేశాడు

లాక్ డౌన్ తో షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాల నుంచి విశ్వక్ సేన్ లాంటి చిన్న హీరోల సినిమాల వరకు అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి టఫ్ టైమ్స్ లో కూడా తన సినిమా షూటింగ్ పూర్తిచేశాడు ఆర్జీవీ. అయితే తను ప్రభుత్వ ఆదేశాల్ని ఉల్లంఘించిలేదంటున్నాడు. ఇంకా చెప్పాలంటే షూటింగ్స్ ఆపేయమని ప్రభుత్వం చెప్పలేదంటున్నాడు వర్మ.

“కరోనా వైరస్ మీద లాక్ డౌన్ లోనే నేను సినిమా తీశాను. ఎందుకంటే ప్రభుత్వం షూటింగ్స్ ఆపమని చెప్పలేదు. రోడ్ల మీదకు రాకుండా ఏదైనా చేసుకోమని చెప్పింది. దీంతో పాటు కొన్ని కండిషన్స్ పెట్టింది. వాటి ప్రకారం ఇంట్లో ఎలా షూట్ చేసుకోవచ్చో ఆలోచించాను. అదే చేశాను. ఒకవేళ షూటింగ్స్ చేయొద్దని ప్రభుత్వం చెప్పిందనే అనుకుందాం. అందుకు విరుద్ధంగా షూటింగ్ చేస్తే ఏం చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం చెప్పలేదు. అందుకే షూటింగ్ చేశాను.”

ఈ మాత్రం దానికి కొంతమంది “ప్రముఖులు” అనుమతుల కోసం ఎందుకు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారో అర్థంకావడం లేదంటున్నాడు వర్మ. షూటింగ్స్ కోసం ప్రభుత్వాన్ని పర్మిషన్ అడగనక్కర్లేదనేది వర్మ లాజిక్.

“ఈమాత్రం దానికి ధైర్యం అక్కర్లేదు. లాజిక్ ఫాలో అయితే చాలు. చాలామంది వెళ్లి షూటింగ్స్ కు అనుమతి ఇవ్వమని అడుగుతున్నారు. నేను మాత్రం అడగలేదు. ఎందుకంటే అసలు ప్రభుత్వం షూటింగ్స్ ఆపమని చెప్పలేదు. వాళ్లిచ్చిన బౌండరీస్ లో షూట్ చేసుకున్నాను. ఇక పర్మిషన్ అడగాల్సిన అవసరం ఏముంది.”

స్టార్స్ తో తనకు సినిమాలు తీయడం చేతకాదని ఒప్పుకున్నాడు వర్మ. పెద్ద హీరోల స్టార్ డమ్ ను, వాళ్ల అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని కథలు రాయడం తనకు రాదని.. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ ను సంతృప్తి పరిచేంత కెపాసిటీ తనకు లేదని చెబుతున్నాడు.