మహేష్ ది స్ట్రాటజీ, పవన్ ది బాధ్యత!

ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ‌లోని ఆర్కే బీచ్ కేంద్రంగా సాగే కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌పై ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ స్పందించారు. జ‌ల్లిక‌ట్టు స్పూర్తితో సాగుతున్న కొవ్వొత్తుల ర్యాలీకి సంఘీభావం సినీతార‌లు ఏక‌మ‌వుతారని ధీమా వ్య‌క్తం చేశారు. జ‌ల్లిక‌ట్టుకోసం త‌మిళులు ఏక‌మై త‌మ ఐక్య‌త‌ను చాటుకున్న‌ట్లే…తెలుగు సినీ న‌టులు సైతం ఒక్క‌తాటిపైకి వ‌స్తార‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఐక్య‌త‌ను సాధిస్తార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రిన్స్ మ‌హేశ్ బాబును సైతం ముగ్గులోకి లాగారు.

గ‌తంలో జ‌ల్లిక‌ట్టుకు మ‌ద్ద‌తిచ్చిన మ‌హేశ్ ఇపుడు ప్ర‌త్యేక హోదాపై త‌న అభిప్రాయం ఎందుకు వెళ్ల‌డించ‌డం లేద‌ని వ‌ర్మ ప్ర‌శ్నించారు.  తమిళ సంప్రదాయం కోసం ట్వీట్ చేసిన మహేష్, తన సొంతం ప్రాంతమైన ఆంధ్రుల పోరాటానికి ఎందుకు మద్దతివ్వలేదని త‌న‌దైన శైలిలో వ‌ర్మ లాపాయింట్ లాగారు.

రాష్ట్రం పట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్నంత బాధ్యత మ‌హేశ్ బాబుకు లేదా అంటూ ప్ర‌శ్నించారు. త‌న సినిమాల‌ డబ్బింగ్ మార్కెట్ కోసం బాదపడ్డంతగా అతన్ని సూపర్ స్టార్ ని చేసిన అసలు మార్కెట్ కోసం బాదపడకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందని వ‌ర్మ ఎద్దేవా చేశారు. మహేష్ ఒకవేళ రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటే జల్లికట్టుకు ఎందుకు సపోర్ట్ చేసినట్టు, పవన్ కు ఎందుకు సపోర్ట్ చేయనట్టు? అంటూ త‌న సందేహాన్ని నిర్మోహ‌మాటంగా బ‌య‌ట‌ప‌టపెట్టారు.

త‌మ హీరో ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ కు మ‌ద్ద‌తు తెలపాల‌ని మ‌హేశ్ అభిమానులు సూచించాల‌ని వ‌ర్మ కోరారు. లేదంటే వారు సైతం ద్రోహులుగా మిగిలిపోతారని వ‌ర్మ ట్వీట్ల వ‌ర్షం కురిపించారు.