మంత్రి రోజా భర్త సెల్వమణి ఆవేదన ఏంటీ?

ఉన్నట్లుండి మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణి మీడియాలో హడావుడి చేస్తున్నాడు. ఆయన సినీ కార్మికుల సంఘం నాయకుడిగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆ తమిళ సినీ కార్మికులకు కష్టం వచ్చిందని.. అది పెద్ద హీరోల వల్ల అంటూ ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చాడు. తాజాగా ఒక టీవీ ఛానల్ చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమిళ హీరోల్లో స్టార్‌ హీరోలు అయిన రజినీకాంత్‌, అజిత్‌, విజయ్ ఇంకా పలువురు స్టార్స్‌ షూటింగ్‌ ల పేరుతో ఎప్పుడు హైదరాబాద్‌ లో ఉంటున్నారు.

తమ సినిమాల్లో సగంకు పైగా హైదరాబాద్‌ మరియు వైజాగ్‌ లోనే చేస్తున్నారు. తద్వారా తమిళ సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడ షూటింగ్ లు చేయడం వల్ల తెలుగు వారికి లాభం కలుగుతుంది.. తెలుగు సినీ కార్మికులు లాభం పొందుతున్నారు. కాని పెద్ద హీరోల వల్ల తమిళ సినీ కార్మికులకు నష్టం తప్పడం లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమిళనాట షూటింగ్‌ లు జరపాలని రజినీ తో పాటు ఇతర స్టార్‌ హీరోలకు ఆయన విజ్ఞప్తి చేశాడు.