ఆర్ ఆర్ ఆర్: ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్న చరణ్, తారక్

టాలీవుడ్ కు చెందిన ఇద్దరు టాప్ హీరోలు నందమూరి తారక రామారావు, రామ్ చరణ్ లు ఒక సినిమా కోసం కలిసి వచ్చారు అన్నదే సంచలనం అయితే రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు అన్నది మరో ఆసక్తికర అంశం. ఇలా ఆర్ ఆర్ ఆర్ ఏ విధంగా చూసినా అంచనాలను అంబరాన్ని అంటే స్థాయిలో ఉంది.

అక్టోబర్ 22న కొమరం భీం స్పెషల్ వీడియోను విడుదల చేయనున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ఆ పాత్రను పోషిస్తుండగా, రామ్ చరణ్ ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. 22న ఉదయం 11 గంటలకు ఈ వీడియో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే ఈరోజు తారక్, చరణ్ లు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం అందరినీ ఆకర్షించింది.

ముందుగా రామ్ చరణ్ ఈ టీజర్ లోని చిన్న బిట్ ను ట్వీట్ చేస్తూ “బ్రదర్, నిన్ను ఊరించడానికి ఇదిగో చిన్న బిట్… నీలా నేను ఆలస్యం చేయను, టైమ్ కు వస్తా” అని ట్వీట్ చేసాడు.

దానికి ఎన్టీఆర్ “నువ్వు ఆల్రడీ 5 నెలలు లేట్ అన్న విషయం గుర్తుంది అనుకుంటా… అయినా రాజమౌళితో ఉంటే ఏ నిమిషాన్న ఏదైనా జరగొచ్చు” అని రిప్లై ఇచ్చాడు. మళ్ళీ చరణ్, “నన్ను నమ్ము బ్రదర్, ఆలస్యమైనా అదిరిపోయే రేంజ్ లోనే ఉంటుంది” అని భరోసా ఇచ్చాడు.