అరవ అతి.. లేదా నమ్మవచ్చా?

ఏదైనా తిమ్మిని బమ్మిని చేసి చెప్పుకోవడం తమిళ చిత్ర రంగంలో బాగా కనిపిస్తుంది. హిందీ సినిమాలు కూడా అయిదు వందల కోట్లు గ్రాస్‌ వసూలు చేయని సమయంలో తమ సినిమాలు అయిదు వందల కోట్లు వసూలు చేసాయంటూ చెప్పుకునే వారు. పైగా ఇలాంటి వాటిని వాళ్ల మీడియా కూడా ఖండించదు. ఏ సినిమా రిలీజ్‌ అయినా ఆహా ఓహో హిట్‌ అనేయడం కూడా వారికో సరదా. ఈ ఏడాదిలో సరిగ్గా ఆడిన సినిమానే లేదని తమిళ ట్రేడ్‌ అంటోంటే, వచ్చిన వాటిలో తొంభై శాతం హిట్లేనని సినిమా వాళ్లు చెప్పుకుంటారు.

‘బాహుబలి’ చిత్రాన్ని ‘2.0’ మించిపోయిందని చూపించుకోవడానికి ప్రస్తుతం అక్కడ చేయని ప్రయత్నం లేదు. బాహుబలి కంటే 2.0కే క్రేజ్‌ ఎక్కువ అని చెప్పుకోవడానికి ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు. తాజాగా 2.0 శాటిలైట్‌ రైట్స్‌ 110 కోట్లకి అమ్ముడయ్యాయంటూ ఒక వార్త పుట్టుకొచ్చింది. అన్ని భాషల్లో ఈ చిత్రం ప్రసార హక్కులని జీ సంస్థ సొంతం చేసుకుందని, ఇందుకోసం 110 కోట్లు చెల్లించిందని చెబుతున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు.

శాటిలైట్‌ రైట్స్‌ పరంగా ఇంతవరకు ఏ సినిమాకీ రాని డీల్‌ దీనికి వచ్చిందంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. బాహుబలి కంటే ఈ చిత్రం క్రేజీ అని చెప్పుకునేదానికి ఈ వార్త వారికి హెల్ప్‌ అవుతోంది. అయితే అక్షయ్‌కుమార్‌ని విలన్‌గా కాస్ట్‌ చేసారని తప్పిస్తే బాలీవుడ్‌లో 2.0పై ఏమంత క్రేజ్‌ లేదు. శంకర్‌ తీసిన సినిమాల్లో ఇండియన్‌ తప్ప అక్కడ ఆడిన ఇంకో సినిమా లేదు. కనీసం ట్రెయిలర్‌ కానీ టీజర్‌ కానీ లేకుండా 2.0పై 110 కోట్లు ఎందుకు పెడతారు? ఇది నమ్మవచ్చా లేదా అనేది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత నిర్ధారించుకోవచ్చు. అందాకా ఈ న్యూస్‌కి ఎక్కువ హైప్‌ ఇవ్వనవసరం లేదు.