సర్కార్‌ దెబ్బ బలంగా తగిలిందిగా!

దర్శకుడిగా శిఖరాలు చూసి, ఎంతో మంది యువకులకి సినీ దర్శకులు కావాలనే కలలు పుట్టించిన రాంగోపాల్‌వర్మ ఫైనల్‌గా వెండితెరని వదిలి యూట్యూబ్‌లో తేలాడు. తను తీసే సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోవడం తప్ప ఇంకోటి జరగకపోవడంతో వర్మ ఫ్రీ ట్యూబ్‌ వైపు వచ్చేసాడు. తన స్వేఛ్ఛకి సెన్సార్‌ బోర్డ్‌ కళ్లెం వేస్తోందని, సెన్సార్‌ లేని యూట్యూబ్‌లో ఇష్టం వచ్చింది చూపిస్తానంటూ నగ్నత్వాన్ని, అశ్లీల పదజాలాన్ని హైలైట్‌ చేస్తూ తన వెబ్‌ సిరీస్‌ని ఇంట్రడ్యూస్‌ చేసాడు.

‘గన్స్‌ అండ్‌ థైస్‌’ మొదటి ఎపిసోడ్‌ రాకముందే ‘మై సన్నీలియోని బన్‌నా చాహ్‌తీ హూ’ అంటూ పోర్న్‌ స్టార్‌ కావాలని కలలు కనే ఒక యువతి అంతరంగాన్ని షార్ట్‌ ఫిలింలో ఆవిష్కరించాడు. దేనికో కొబ్బరికాయ దొరికిన చందంగా ఈయనకిపుడు యూట్యూబ్‌ దొరికిందంటూ కామెంట్లు పడుతున్నాయి. అయితే సడన్‌గా ట్విట్టర్‌ వదిలేసి ఇలా యూట్యూబ్‌ వైపు వర్మ ఎందుకు మళ్లినట్టు? సర్కార్‌ 3తో మళ్లీ తనకి పూర్వ వైభవం వస్తుందని వర్మ ఆశించాడు. ముంబయికి షిఫ్ట్‌ అయి, ‘కంపెనీ’ అంటూ సొంత ఆఫీస్‌ ఓపెన్‌ చేయడానికి కూడా కారణమిదే.

అయితే అమితాబ్‌ వున్నప్పటికీ, విడుదలకి ముందు ఎన్నో రిపేర్లు చేసినప్పటికీ సర్కార్‌ 3 డిజాస్టర్‌ అయింది. ఇంతకాలం ఎన్ని ఫ్లాప్స్‌ వచ్చినా చలించని వర్మ ఈ షాక్‌ తర్వాత కొత్త సినిమాలు అనౌన్స్‌ చేయడం మానేసి యూట్యూబ్‌ వీడియోలు మొదలు పెట్టాడు. బ్యాడ్‌ లక్‌ ఏమిటంటే యూట్యూబ్‌లో మునుపటిలా రెవెన్యూ లేదు. క్వాలిటీ కంటెంట్‌ ఇప్పటికే చాలా లభిస్తోంది కనుక దాని మధ్య వర్మ ఎంతో అద్భుతమైన కంటెంట్‌ అందిస్తే తప్ప ఉపయోగం వుండదు. న్యూడిటీ, ప్రొఫేనిటీ వల్ల కొద్ది రోజుల పాటు సంచలనం చేయవచ్చు కానీ దాని మీదే వెబ్‌ సిరీస్‌ నడపడం కష్టం కనుక ఇదీ వర్మకి అగ్ని పరీక్షే.