సస్పెన్స్ ను బ్రేక్ చేస్తే ఛాన్స్ ఈ ఐదింటికే.

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజులు. తమిళనాడు అధికారపక్షంలో నెలకొన్న సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకోవమే కాదు.. ఈ రోజు ఏదో ఒకటి జరిగిపోతుందన్న వాదన వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే ఎవరికి వారు తమ తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేయటంతో పాటు.. ఇవాళ ఏదో ఒకటి చేయాలన్న లక్ష్యం కనిపించటం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన ఎపిసోడ్ లో సైలెన్స్ ను బ్రేక్ చేసే ఛాన్స్ ఐదింటికే ఉన్నాయని చెప్పాలి. ఆ ఐదు ఏమిటో చూస్తే..

1.  సైలెన్స్ ను బ్రేక్ చేసేలా పని మొదట పన్నీర్ సెల్వం నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే.. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన అపద్ధర్మ సీఎం హోదాలో సచివాలయానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఆయన సచివాలయానికి చేరుకోనున్నారని చెబుతున్నారు. ఇప్పటివరకూ తాను జారీ చేసిన ఆదేశాలు ఎంతమేర అమలు అయ్యాయయన్న అంశంపై మీద ఆయన ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. అన్నింటికి మించి.. వేద నిలయం నుంచి చిన్నమ్మను బయటకు పంపే కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పన్నీర్ దృష్టి పెట్టే అంశాల్లో ఒకటి రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల్ని బయటకు తెచ్చే కార్యక్రమం ఒకటైతే.. రెండోది.. వేద నిలయం నుంచి చిన్నమ్మను బయటకు పంపే ప్రయత్నం మరొకటి. ఈ రెండూ కాకుండా ఇంకేం చేయనున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏం చేసినా.. అందుకు తగ్గట్లే పరిణామాల్లో మార్పు ఉంటుందని చెబుతున్నారు.

2.  సైలెన్స్ ను బ్రేక్ చేసే అవకాశం శశికళకు చాలానే ఎక్కువగా ఉంది. వారం క్రితం వరకూ ఆమెకున్న పవర్ తో పోలిస్తే.. ఇప్పుడామె పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. వారం ముందు వరకూ వంగివంగి దండాలు పెట్టిన వారే.. ఇప్పుడు తల ఎగురవేయటమే కాదు.. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తనను లక్ష్యంగా చేసుకోవటంపై శశికళ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. అంతకంత బదులు తీర్చుకోవాలన్న కసిలో ఉన్నారు. ఏ చిన్నఅవకాశం చేతికి చిక్కినా.. తానేంటో చాటి చెప్పాలన్నట్లుగా ఆమె తీరు ఉండటం గమనార్హం. దీనికి తగ్గట్లే.. రెండు రోజులుగా బోసిగా ఉన్న వేదనిలయం వద్దకు ఈ రోజు ఉదయం నుంచి భారీగా కార్యకర్తలు చేరుకోవటం.. చేతిలో పార్టీ జెండాలతో వారు ఉండటం చూస్తే.. ఈ రోజు చిన్నమ్మ ఏదైనా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారా? లేక.. మరేదైనా ఊహించని రీతిలో ఆమె రియాక్ట్ కానున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

3.  వారం రోజులుగా సాగుతున్న హైడ్రామాకు పుల్ స్టాప్ పెట్టే అన్నీ అధికారాలు ఉన్న ఏకైక వ్యక్తిగా ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న విద్యాసాగర్ రావుకు ఉంది. అయితే.. ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కొందరు చెబుతుంటే.. కేంద్రం నుంచి అందుతున్న సూచలనకు తగ్గట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. వారంగా సాగుతున్న నాటకీయ పరిణామాలకు చెక్ చెప్పే ఏదో ఒక నిర్ణయాన్ని ఈ రోజు ఆయనతీసుకునే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. ఓపక్క పన్నీర్.. మరోపక్క శశికళ ఇరువురు ఎత్తులు.. పైఎత్తులు వేస్తున్న నేపథ్యంలో ఆయనీ రోజు ఏదో నిర్ణయం తీసుకోకతప్పదన్న మాట వినిపిస్తోంది.

4.  తమిళనాట నెలకొన్న సస్పెన్స్ ను బ్రేక్ చేసే అవకాశం ఉన్న మరొకటి హైకోర్టుగా చెప్పాలి. రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు వాంగ్మూలాల్ని రికార్డు చేసి తమకు పూర్తిస్థాయి నివేదికనుసోమవారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో  పోలీసు శాఖ ఇప్పటికే రిసార్ట్స్ కు వెళ్లి ఎమ్మెల్యేల వాంగ్మూలాల్ని రికార్డు చేశారు. మరి..పోలీసులకు ఎమ్మెల్యేలు చెప్పిందేమిటి? దానిపై వారు హైకోర్టుకు ఏం చెప్పనున్నారు? అందుకు హైకోర్టు ఎలా రియాక్ట్ కానుందన్న అంశాల్ని చూస్తే.. హైకోర్టు తీసుకునే నిర్ణయం కూడా సస్పెన్స్ కు బ్రేకులు వేసేలా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.

5.  తమిళనాట నెలకొన్న సస్పెన్స్ ను బ్రేక్ చేసే ఐదో అంశంగా.. ఇప్పటివరకూ ఆచూకీ లేకుండా పోయిన 32 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల విషయం ఈ రోజు ఎంతోకొంత తేలే వీలుందన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో రిసార్ట్స్ లో ఉన్న ఎమ్మెల్యేల్లో చాలామంది తనతో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్ననేపథ్యంలో.. వారి నుంచి అనూహ్యస్పందన ఏదైనా చోటు చేసుకుంటే  సప్పెన్స్ సీన లో మార్పు రానుంది.