దయనీయస్థితిలో బాలీవుడ్ నటుడు

కరోనా నేపథ్యంలో ఇండియాలో పెట్టిన లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు. ఆర్ధిక ఇబ్బందులతో చాలా మంది అల్లాడిపోతున్నారు. వారిలో ప్రముఖ హిందీ నటుడు, మహాభారత్ సీరియల్ లో ఇంద్రుడి పాత్ర పోషించిన సతీశ్ కౌల్ కూడా ఉన్నారు.

దాదాపు 300 సినిమాల్లో కూడా నటించిన ఈ నటుడు ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడని తెలుస్తోంది. నిత్యావసరాలు కూడా కొనుగోలు చేసుకోలేని స్థితిలో ఉన్నాడని సన్నిహితులు అంటున్నారు. ప్యార్ తో హోనా హిధా, ఆంటీ నెంబర్ వన్.. వంటి హిందీ సినిమాలతో పాటు పలు పంజాబీ సినిమాలు కూడా చేశాడు సతీశ్ కౌల్.

ఆర్ధికంగా ఎదగలేకపోయిన సతీశ్ కు 2015లో జరిగిన ఓ యాక్సిడెంట్ ఇంట్లో మంచానికే పరిమితమయ్యేలా చేసింది. అప్పట్నుంచి పంజాబ్ లోని లుధియానాలో ఓ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నాడు.

లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అంటున్నారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ రియాలిటీ షో టీవీ యాంకర్ కపిల్ శర్మ కొంత ఆర్ధికసాయం కూడా చేశారు. రీసెంట్ గా మహాభారత్ సీరియల్ రీ టెలికాస్ట్ కావడంతో సతీశ్ ఈ జనరేషన్ కు కూడా పరిచయమయ్యాడు.