మంగ్లీ ఎమోషన్ః విషయం తెలుసుకొని మాట్లాడాలంటూ ఫైర్!

తెలుగులో అనూహ్యంగా ఎదిగిన సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్. ఓ టీవీ ఛానల్ లో యాంకర్ మంగ్లీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. ఆ ఎపిసోడ్ పాపులర్ కావడంతో అదే పేరుతో పాపులర్ అయ్యింది. ఈ క్రమంలోనే తెలంగాణ ఫార్మేషన్ సాంగ్ తో తనలోని సింగర్ ను ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ పాట కూడా అద్భుతంగా క్లిక్ కావడంతో.. ఆమెలోని సెకండ్ యాంగిల్ లోకానికి తెలిసి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో గీతాలు ఆమె నుంచి వచ్చాయి. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి.. తన సత్తా చాటుకుంది.

అయితే.. ప్రతీ ఫెస్టివల్ కు మంగ్లీ ఓ కొత్త పాటతో రావడం కామన్ అయిపోయింది. ఇదే క్రమంలో తాజాగా బోనాల సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ”చెట్టుకింద కూసున్నవమ్మా..” అంటూ సాగిపోయే మైసమ్మ పాటలో ”మోతెవరి లెక్క కూసుకున్నవమ్మా..” అనే పదాన్ని వాడారు. దీనిపై కొందరు అభ్యంతరం తెలిపారు. మరికొందరు హద్దులు దాటి వ్యాఖ్యానాలు చేశారు. పాట విడుదల చేసిన మొదటి రోజు నుంచే మొదలైన ఈ కామెంట్ల పరంపర.. రానురానూ శృతిమించింది. చివరకు కొందరు ఈ విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.

దీంతో.. అనివార్యంగా ఈ పాట గురించి అందులో వాడిన పదాల గురించి మంగ్లీ వివరణ ఇచ్చింది. కనీసం చరిత్ర తెలియని వారు ఏదేదో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామదేవతలను ఎలా పూజిస్తారో తెలుసుకుంటే మంచిదని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి వివరణ ఇస్తూ.. సోషల్ మీడియాలో సుదీర్ఘ వివరణ ఇచ్చింది సత్యవతి. ఆమె ఏం చెప్పింది అన్నది పూర్తిగా ఆమె మాటల్లోనే చూస్తే…

”రచయిత రామస్వామి ( ఈ పాట రాసిన రచయిత) గారి అభిప్రాయం ప్రకారం.. చెట్టుకింద కూసున్నవమ్మ పాటలో మెతవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంత మంది కళాకారులు పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాం. గ్రామదేవతల ఒగ్గు కథలు బైండ్లోల్ల కొలువులు ఇలా రకరకాల ఆచారాలున్నాయి. భక్తిలో కూడా మూఢ భక్తి వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాం.

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు పుట్లను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్ శీతల (సాతి భవాని) పండగల్లో ప్రకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వచ్చినా.. మేము చెప్పుకునేది నమ్ముకునేది గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేది తాగేది ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము. నేను సింగర్ గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప ఆంజనేయ స్వామి దీవెన మీ అభిమానం ఆదరణ వల్లే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో మా తాతలనాటి ఆంజనేయ స్వామి విగ్రహానికి గుడి కట్టించి పూజలు చేస్తున్నాము.

ఏనాడూ గుడికి వెళ్లనివాళ్లు బోనం ఎత్తనివాళ్లు కూడా నా జాతి ప్రాంతం కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలి. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ సమ్మక్క సారక్క శివరత్రి సంక్రాంతి బోనాలు.. ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈ సారికి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్లి మరీ చిత్రీకరించాము. ప్రతి పండగలో నా పాటల ద్వారా మీ ఇంటి భాగస్వామిని అయ్యాను. మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులో పెట్టుకున్నారు. ఇందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఒక్క రోజులో ఫేమస్ కాలేదు. నా పాటల వెనుక పదేళ్ల కష్టం ఉంది. కానీ.. కొందరు తమ ఇంట్లో తల్లి చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు.

గ్రామ దేవతలను ఎలా కొలుస్తారు? మైసమ్మ కొలువు పాటలు నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకుని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది. ఈ పోస్టు నా మనసుకు బాధ కలిగించిన వారి కోసం నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసం. ఈ పాటపై విమర్శలు వచ్చిన రోజే పాట మార్చే అవకాశం ఉన్నప్పటికీ.. పాట కోసం ప్రాణం పెట్టిన రచయిత రామస్వామి గారిని తక్కువ చేయొద్దనే ఈ నిర్ణయం తీసుకోలేదు. కానీ.. దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ను కూడా కించపరుస్తున్నారు. అందుకే.. ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుతితో లిరిక్స్ లో మార్పులు చేశాం.” అని వివరణ ఇచ్చింది మంగ్లీ.