గైక్వాడ్‌కు జ్ఞానోద‌యం అయ్యిందండోయ్‌!

ఎయిర్ ఇండియా ఉద్యోగిని కాలుకున్న చెప్పుతో ఎడాపెడా వాయించడ‌మే కాకుండా… ఒక్క‌సారి కాదు… 25 సార్లు కొట్టానంటూ బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన శివ‌సేన ఎంపీ ర‌వీంద్ర గైక్వాడ్ కు ఎట్ట‌కేల‌కు జ్ఞానోద‌యం అయ్యిన‌ట్టుంది. త‌మ ఉద్యోగిపై దాడి చేసిన గైక్వాడ్‌కు త‌మ విమానాల్లో ప్ర‌యాణాన్ని నిషేధించిన ఎయిర్ ఇండియా… మిగిలిన విమాన‌యాన సంస్థ‌ల చేతా ఆయ‌న‌పై నిషేధం విధించేలానే చేసింది. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి మిత్రప‌క్ష‌మైన‌ప్ప‌టికీ కూడా న‌రేంద్ర మోదీ స‌ర్కారు గైక్వాడ్ త‌ప్పును బాగానే ఎలివేట్ చేసింది. క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. ఈ క్ర‌మంలో గైక్వాడ్ జాతీయ వ్యాప్తంగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు.

త‌న‌ను విమానం ఎక్క‌కుండా ఎలా ఆపుతారో చూస్తానంటూ స‌వాల్ విసిరిన గైక్వాడ్‌… అన్ని వ్య‌వ‌స్థ‌లు ఒక్క‌టైతే ఏం జ‌రుగుతుందోన‌న్న విష‌యం బోధ‌ప‌డానికి కాస్తంత స‌మ‌యం ప‌ట్టింది. మొన్న పార్ల‌మెంటు సాక్షిగా కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజుపైనే దాడికి య‌త్నించిన శివ‌సేన ఎంపీల తీరు దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చ‌కే దారి తీసింది. మ‌రింత ర‌చ్చ చేస్తే… ఉన్న ప‌రువు కాస్తా పోతుందేమోన‌న్న భ‌యంతో శివ‌సేన ఎట్ట‌కేల‌కు దిగొచ్చేసింది. గైక్వాడ్‌తో క్ష‌మాప‌ణ లేఖ రాయించింది. గైక్వాడ్ సారీ చెబుతూ లెట‌ర్ రాసినా కూడా ఎయిర్ ఇండియా శాంతించిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. అయితే గైక్వాడ్ ఓ మెట్టు దిగారు క‌దా… మ‌న‌మూ ఓ మెట్టు దిగాల్సిందేన‌న్న కేంద్రం సూచ‌న‌తో ఎయిర్ ఇండియా మెత్త బ‌డింది. వెంట‌నే గైక్వాడ్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.

నిషేధం ఉన్నంత కాలం రోజు విమానంలో ప్ర‌యాణించేందుకు టికెట్టు కొన్న గైక్వాడ్‌… ఎయిర్ ఇండియా నిషేధాన్ని ఎత్తివేయ‌గానే… మ‌రో కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌పై ఎయిర్ లైన్స్ సంస్థ‌లు నిషేధం ఎత్తివేసినా… తాను మాత్రం విమానంలో కాకుండా రైల్లోనే ప్ర‌యాణిస్తాన‌ని ఆయ‌న నిన్న మాట‌తో కాకుండా చేత‌తో చెప్పేశారు. నిన్న ఉద‌యం పుణే నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లాల్సిన ఆయ‌న అందుకు విరుద్ధంగా పుణేలో రాజ‌ధాని ఎక్స్ ప్రెస్ ఎక్కేసి ఢిల్లీ చేరుకున్నారు. ఇదేంట‌ని ప్ర‌శ్నించిన మీడియాకు గైక్వాడ్ చెప్పిన స‌మాధానం ఆస‌క్తిక‌రంగానే ఉంది. ‘నేను సామాన్య పౌరుడిని. అందుకే రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ వచ్చాను. రేపు కూడా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులోనే ముంబయికి తిరిగి వెళ్తాను’ అని గైక్వాడ్ చెప్పుకొచ్చారు. అంటే… వివాదం చెల‌రేగి ర‌చ్చ జ‌రిగితే గానీ… తాను చేసిన త‌ప్పు గైక్వాడ్‌కుఎ బోధ‌ప‌డ‌లేద‌న్న మాట‌. అంతేకాదండోయ్‌… ఈ దెబ్బ‌తో అస‌లు ఎంపీ అంటే ఏమిటో కూడా గైక్వాడ్‌కు అర్థ‌మ‌య్యింద‌న్న వాద‌న వినిపిస్తోంది.