అమెరికాలో మంచు తుఫాన్‌…స్తంబించిపోయిన అగ్ర‌రాజ్యం

అగ్ర‌రాజ్యం అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వ‌ణికిపోతోంది. మంచు తుఫాన్ తీవ్ర‌మ‌వ‌డంతో మూడు కోట్ల మంది బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్ప‌టికే 7600 విమానాలు ర‌ద్ద‌య్యాయి. వేలాది స్కూళ్లు మూత‌ప‌డ్డాయి. ఇప్ప‌టికే అధికారులు ప‌లు ప్ర‌మాద హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. వంద కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని, విజిబిలిటీ జీరోకి ప‌డిపోనుండ‌టంతో అత్య‌వ‌స‌ర‌మైతే బ‌య‌ట‌కు రావాల‌ని సూచించారు. న్యూయార్క్ గ‌వ‌ర్న‌ర్ ఆండ్రూ కూమో అత్య‌వ‌స‌ర చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. ఇప్ప‌టికే భారీగా బ‌ల‌గాల‌ను న‌గ‌రంలో మోహ‌రించారు.

అమెరికాలోని ప్ర‌తి ముగ్గురిలో ఒక‌రు ఈ మంచు తుఫాన్ కార‌ణంగా ప్ర‌భావిత‌మ‌వుతున్న‌ట్లు సీఎన్ఎన్ చానెల్ వెల్ల‌డించింది. న్యూయార్క్‌, బోస్ట‌న్‌లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల‌ను మంచు దుప్ప‌టి క‌ప్పేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. రెండు అడుగుల మేర భారీగా మంచు కురిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మంగ‌ళ‌వారం వాతావ‌ర‌ణ రిపోర్ట్ స్ప‌ష్టం చేస్తుంది. స్థానిక కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం ఉద‌యం 6 నుంచి 9 గంట‌ల మ‌ధ్య భారీగా మంచు తుఫాన్ ప్ర‌భావం ఉండ‌నుంది. మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలోని అన్ని విమానాల‌ను ర‌ద్దు చేశారు. న్యూయార్క్ న‌గ‌రంలో 20 అంగుళాల మేర మంచు కుర‌వ‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  ఫిల‌డెల్ఫియాలో 10 అంగుళాలు, మ‌సూచుసెట్స్‌లో 24 అంగుళాల మేర మంచు కుర‌వ‌నుంది.

ఇదిలాఉండ‌గా… స్థానిక కాల‌మానం ప్ర‌కారం మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి కనెక్టిక‌ట్ రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌యాణాల‌పై నిషేధం విధించారు. అటు వ‌ర్జీనియాలో పోర్ట్ ఆఫ్ వ‌ర్జీనియాను కోస్ట్ గార్డ్ మూసివేసింది. తూర్పు తీరంలో ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా ఉండాల‌ని, అధికారుల సూచ‌న‌లు పాటించాల‌ని అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే మంచు తుఫాన్ కార‌ణంగా విస్కాన్సిన్‌లో ఇద్ద‌రు చ‌నిపోయారు.