టీడీపీలో సెగ‌లు రేపుతున్న వీర్రాజు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌క‌టించిన‌ ప్యాకేజీకి కేంద్రమంత్రివర్గం చట్టబద్ధత కల్పించే నోట్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయాలు మారిపోతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని తమ సొంతం చేసుకునేందుకు మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఎవరి వ్యూహాలకు వారు పదునుపెడుతున్నాయి. రెండు పార్టీలు ఆ అంశానికి రాజకీయ ప్రాధాన్యంతోపాటు, తమ వల్లే ప్యాకేజీ, పోలవరం నిర్మాణంపై హామీ ద‌క్కింద‌నే ప్ర‌చారానికి పదునుపెడుతూ చ‌ర్చ‌ల‌కు తెర‌లేపాయి. ఏపీ బీజేపీలో క్రియాశీలంగా ఉండ‌ట‌మే కాకుండా మిత్ర‌ప‌క్షానికి పంటికింద రాయిలాగా మారిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి చెక్ పెట్టేందుకు సిద్ధ‌మయ్యారు.

ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాలతోపాటు, పోలవరానికి వందశాతం నిధుల వల్ల వచ్చే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ ప్ర‌క్రియ‌లో పార్టీ నేత‌ల కంటే టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు ముందున్నారు. ప్ర‌త్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం, అందులో కీలకమైన పోలవరం నిధులు- విదేశీ రుణాలకు అనుమతి వంటి అంశాల ఆమోదం కోసం తాను చాలా కష్టపడినట్లు సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే చెప్పుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అసలు పోలవరం ప్రాజెక్టు కోసం తాను కొన్ని డజన్ల సార్లు తిరిగాననని, ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షతోపాటు, వర్చువల్ విజిట్ కూడా నిర్వహిస్తూ సోమవారాన్ని ‘పోలవారం’గా మార్చానని బాబు తాజా సభలో వెల్లడించారు. అదే సమయంలో ముంపు గ్రామాలను విలీనం చేసిన తర్వాతనే తాను సీఎంగా ప్రమాణం చేశానని, అందుకే పోలవరానికి అడ్డంకులు లేకుండా పోయాయని గుర్తు చేయడం ద్వారా, తన వల్లే పోలవరం పూర్తికాబోతుందని బాబు చెప్పకనే చెప్పారు. బాబు కృషితోనే ముంపుమండలాలు ఏపీలో విలీనమయ్యాయని దేశం సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో పొగడ్తల వర్షం కురిపించడం ద్వారా పార్టీ భవిష్యత్తు వ్యూహమేమిటో స్పష్టమయింది.

అయితే టీడీపీకి ప్ర‌చారానికి ఆదిలోనే బ్రేకులు వేసే ప‌నుల‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మొద‌లుపెట్టేశారు. ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించిన బీజేపీ త‌ర‌ఫున ఆ అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్యాకేజీలో కీలక అంశమైన పోలవరానికి వంద శాతం నిధులు సమకూర్చినందున, ఇక పోలవరం తమ సొంతమేనన్న ప్రచారంతో ప్రజల వద్దకు వెళ్లనుంది. దీనిపై   బీజేపీ ఆలోచనాధోరణిని వీర్రాజు పరోక్షంగా వెల్లడించారు. పోల‌వ‌రం నిర్మాణం క్రెడిట్ ఇక త‌మ‌దేన‌ని, దీనిపై ఎవరికీ హక్కు లేదని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో టీడీపీ ఎంపీ సుధారాణి పోలవరం వద్దని చెబితే ఆ పార్టీ నేత‌లు మౌనం వహించారని గుర్తు చేస్తూ ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్టుకు వందశాతం నిధులు బీజేపీ ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు ప్రధాన అవరోధమైన ముంపుమండలాల విలీనం, సీలేరు ప్రాజెక్టు ద్వారా అయ్యే విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలను తామే చంద్రబాబు ప్రభుత్వానికి వివరించ‌డ‌మే కాకుండా కేసీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నందున ముందు ముంపుమండలాలను విలీనం చేయించాలని సూచించిన విషయాన్ని కూడా బీజేపీ ప్రచారం చేయనుందని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌త్యేక ప్యాకేజీ-పోల‌వ‌రం నిర్మాణం ఘ‌న‌త‌ను తమ ఖాతాలో  వేసుకుందామ‌ని, తెలుగుదేశం ప్రభుత్వం స‌త్తా అంటూ జనంలోకి తీసుకువెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతున్న త‌రుణంలో వీర్రాజు త‌మ‌కు కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యాడ‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. వీర్రాజు తాజా ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో త‌మ ప్ర‌చార వ్యూహాలు మార్చుకోవాల‌ని తెలుగు త‌మ్ముళ్లు అంటున్నారు.