బాలుతో చిన్నప్పటి నుంచి పరిచయం: ఉప రాష్ట్రపతి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించింది. వారు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరం.

వివిధ భారతీయ భాషల్లో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన శ్రీ బాలు ఈటీవీలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాన గంధర్వుడైన శ్రీ ఎస్పీ బాలు మా ఊరివాడైనందున చిన్నప్పటినుంచి చాలా పరిచయముంది. ఆయన కోలుకుంటున్నారని, రోజూ కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడుతున్నారని తెలిసి సంతోషిస్తుండగానే ఇలా జరగడం బాధాకర’’మన్నారు.

‘‘గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త కలవరపరిచింది. 16 భారతీయ భాషలలో 40,000 పాటలను అందించిన బహుముఖ గాయకుడిని కోల్పోయాం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది’’