శ్రీను వైట్లకు నిర్మాత కావలెను

మొత్తానికి శ్రీను వైట్ల ఘటికుడే. ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లు వరుసగా మూడు డిజాస్టర్లు ఇచ్చాక కూడా ఇంకో హీరోను మెప్పించగలిగాడు. తనకు వెంకీ.. దుబాయ్ శీను లాంటి మెమొరబుల్ మూవీస్ ఇచ్చాడన్న కృతజ్నతతోనో ఏమో మాస్ రాజా రవితేజ.. వైట్లతో సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే వైట్ల చెప్పిన కథకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.

‘మిస్టర్’ సినిమా చూశాక.. వైట్ల ఇక ఇండస్ట్రీ నుంచి అంతర్ధానమైపోతాడేమో అన్న సందేహాలు కలిగాయి. వరుసగా మూడో సినిమాతోనూ నిర్మాతల్ని నిండా ముంచేయడం.. తనతో పని చేసిన హీరోల ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేయడంతో అతడికి ఇప్పుడిప్పుడే ఇంకో అవకాశం దక్కడం కష్టమే అనుకున్నారు. ‘మిస్టర్’ రిజల్ట్ చూసి వైట్ల డిప్రెషన్లోకి వెళ్లినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆశ్చర్యకరంగా వైట్ల చాలా త్వరగానే ఒక కథ రెడీ చేసుకుని రవితేజ లాంటి స్టార్ హీరోను మెప్పించగలిగాడు.

ఐతే మాస్ రాజా అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కానీ.. ఈ సినిమాకు నిర్మాత  ఎవరన్నదే తేలలేదని సమాచారం. ప్రొడ్యూసర్ గురించి ఆలోచించకుండా ముందు రవితేజను మెప్పించేందుకు ప్రయత్నించి విజయవంతమయ్యాడు వైట్ల. ఇక ఇద్దరూ కలిసి నిర్మాత వేటలో పడబోతున్నారు. ఇక్కడ వైట్ల చేయగిలిగింది పెద్దగా ఏం లేదు. అతణ్నిచూసి అయితే ఏ నిర్మాత ముందుకు రాకపోవచ్చు. నిర్మాతను పట్టే బాధ్యత రవితేజానే తీసుకోవాలి. మాస్ రాజాకు ఉన్న మినిమం గ్యారెంటీ ఇమేజ్ దృష్ట్యా ఎవరో ఒక నిర్మాత ముందుకు రాకపోరని అంటున్నారు. చూద్దాం మరి ఈ కాంబోను నమ్మేదెవరో?