రాజమౌళి తలచుకుంటే అంతే

బాహుబలి సెన్సార్‌ పూర్తయినా కానీ ఇంతవరకు టాక్‌ ఏంటనేది బయటకి రాలేదు. ఏ సినిమా సెన్సార్‌ అయినా కానీ వెంటనే దాని టాకేంటి, కథేంటి, ఫస్ట్‌ హాఫ్‌ ఎలాగుంది, సెకండ్‌ హాఫ్‌ ఏమవుతుంది, క్లయిమాక్స్‌ పరిస్థితేంటి అంటూ చాలా కథనాలు మీడియాలో ప్రత్యక్షమవుతాయి. కానీ బాహుబలి 2కి సంబంధించి ఇంతవరకు చిన్న న్యూస్‌ కూడా లీకవలేదు.

సెన్సార్‌ సభ్యులు ఎవరూ ఈ చిత్రం డీటెయిల్స్‌ బయటకి పొక్కనివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలపై క్యూరియాసిటీ అధికంగా వుండడంతో ఆ రహస్యాలు బయటకి పొక్కకుండా రాజమౌళి జాగ్రత్త పడ్డాడు. ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని, ఎలాంటి ఇన్‌ఫర్మేషన్‌ బయటకి లీక్‌ చేయని ఎలీట్‌ టీమ్‌తో సెన్సార్‌ చేయించారట.

యావరేజ్‌ బోర్డ్‌ మెంబర్స్‌ని సెన్సార్‌ కార్యక్రమానికి దూరంగా వుంచారట. ప్రొజెక్షన్‌ వేసిన వారితో సహా తమకి నమ్మకస్థుడే వుండేట్టు చూసుకున్నారట. దీంతో సెన్సార్‌ అయిపోయినా కానీ లీకు వీరులకి ఇంతవరకు ఎలాంటి వార్త అందలేదు. కుదిరితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఇన్‌ఫర్మేషన్‌ లీక్‌ చేసేయాలని చూసినవారికి రాజమౌళి తనదైన శైలిలో చెక్‌ పెట్టాడు. ఈ సినిమా కథకి సంబంధించి ఎలాంటి ఇంపార్టెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ బయటకి వచ్చినా హైప్‌ ఎఫెక్ట్‌ అవుతుంది కనుక ఇంత పకడ్బందీగా సెన్సార్‌ ప్లాన్‌ చేసారు.