బాలయ్య స్టంపరా.. ఇదేంటి?

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘పైసా వసూల్’ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఐతే ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ ప్లాన్స్ ఏమీ ఇంకా ఊపందుకోలేదు.  ఆ మధ్య బాలయ్య పుట్టిన రోజుకు రెండు ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు తప్పితే.. అంతకుమించి ఇంకే విశేషాలనూ పంచుకుంది లేదు.

ఐతే ఇంకో రెండు మూడు వారాల్లో ఫస్ట్ కాపీనే రెడీ అయిపోతున్న నేపథ్యంలో ఇక సైలెంటుగా ఉంటే కుదరదు. ముందు అనుకున్నట్లు సెప్టెంబరు 29న కాకుండా ఇంకా ముందుగానే సినిమాను రిలీజ్ చేసేయాలన్న ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో ఇక ప్రమోషన్ హంగామాకు శ్రీకారం చుట్టబోతున్నారు.

ఇందులో భాగంగా నిన్న రాత్రి నుంచి చిత్ర బృందం ట్విట్టర్లో ‘ఎన్బీకే 101 ఫీవర్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో బాలయ్య 1974లో సినీ అరంగేట్రం
చేసినప్పటి నుంచి ఆయన ప్రస్థానాన్ని సంక్షిప్తంగా చూపించారు. ‘ఆదిత్య 369’లో టైమ్ మెషీన్ ద్వారా కాలంలో ప్రయాణిస్తున్నపుడు వివిధ పరిణామాల్ని చూపించినట్లు బాలయ్య కెరీర్‌ను అవలోకనం చేశారు. చివరగా ‘పైసా వసూల్’ దగ్గర ఆగారు.

ఈ సందర్భంగానే ఈ నెల 28న ‘స్టంపర్ 101’ రిలీజవుతుందంటూ ప్రకటించారు. ఐతే ఈ స్టంపర్ ఏంటన్నది జనాలకు అర్థం కాలేదు. టీజర్‌కే ఇలా కొత్త పేరు పెట్టి లాంచ్ చేయబోతున్నట్లు తెలిసింది. మరి ఈ ‘స్టంపర్’ అభిమానుల్ని ఎంతమాత్రం అలరిస్తుందో చూడాలి. డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు హాజరై వచ్చిన పూరి మళ్లీ షూటింగ్‌కు వచ్చేశాడట. ఇంకొన్ని రోజుల్లోనే సినిమా పూర్తయిపోతుందని సమాచారం. ఆగస్టు 15 కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలన్న ప్రణాళికతో పని చేస్తున్నాడట పూరి.