చిన్న సీన్లా.. నా వ‌ల్ల కాదంటున్న సుకుమార్

రంగ‌స్థ‌లం సినిమాతో ద‌ర్శ‌కుడు సుకుమార్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మామూలుగానే స్క్రిప్టుల విష‌యంలో విప‌రీతంగా శ్ర‌మించే సుకుమార్.. ఈసారి ఇంకా పెరిగిపోయిన అంచ‌నాల్ని అందుకోవ‌డం కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డ్డారు. ఏకంగా రెండేళ్లు స‌మ‌యం తీసుకుని కొత్త సినిమాకు స్క్రిప్టు వండారు. మ‌ధ్య‌లో కొన్ని అనూహ్య ప‌రిణామాలు జ‌రిగి మ‌హేష్‌తో అనుకున్న సినిమా కాస్తా అల్లు అర్జున్‌కు మారింది. దీని వ‌ల్ల కూడా కొంత ఆల‌స్యం జ‌రిగింది.

అంతా మ‌న మంచికే అన్న‌ట్లుగా త‌న క‌థ‌ను మ‌రింత ర‌గ్డ్ స్ట‌యిల్లో తీయ‌డానికి సుక్కుకు అవ‌కాశం వ‌చ్చింది. హీరో మారిన నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా మ‌ల‌చాల్సిన ప్రెజ‌ర్ ఎదుర్కొంటున్నాడు సుక్కు. ఐతే ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా చిత్రీక‌ర‌ణ‌కు అన్నీ సిద్ధం చేసుకుంటే క‌రోనా వ‌చ్చి ఆయ‌న ప్రణాళిక‌ల‌న్నింటినీ దెబ్బ తీసేసింది.

అస‌లే షూటింగ్ ఆల‌స్య‌మైంది.. ఇక ఏమాత్రం లేట్ చేయ‌కుండా సినిమాను త్వ‌ర‌గా లాగించేయాల‌నుకున్నాడు సుక్కు. ఇందుకోసం ప‌క్కాగా షెడ్యూళ్లు వేసుకున్నాడు. ఈసారి సుక్కు ఎంచుకున్న‌ది బాగా కాంప్లికేటెడ్ అయిన ఎర్ర‌చంద‌నం స్టోరీ. ఈ సినిమా మేకింగ్‌లో విప‌రీత‌మైన శ్ర‌మ ఉంది. ఐతే ముందుగా సినిమాలో అత్యంత క‌ష్ట‌మైన ఎపిసోడ్లు లాగించేయాల‌ని సుక్కు అనుకున్నాడు. త‌న‌తో పాటు నిర్మాత‌లు, టీం మొత్తంలో ఒక ఎన‌ర్జీ, కాన్ఫిడెన్స్ తీసుకురావాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం.

ఇందుకోసం సినిమా ఎసెన్స్‌ను తెలిపే హీరో ఇంట్రో సాంగ్, ఆ త‌ర్వాత యాక్ష‌న్ ఘ‌ట్టాలు, కీల‌క స‌న్నివేశాలు వ‌రుస‌బెట్టి రెండు నెల‌ల పాటు చిత్రీక‌రించాల‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ క‌రోనా వ‌చ్చి అందుకు అవ‌కాశ‌మే లేకుండా చేసింది. ఇవ‌న్నీ భారీ కాస్ట్ అండ్ క్రూతో మూడిప‌డ్డవే. వంద‌ల్లో జూనియ‌ర్ ఆర్టిస్టులు అవ‌స‌రం. కానీ ఇప్పుడు అంత‌మందితో షూటింగ్ చేసే ప‌రిస్థితి లేదు. త‌ను అనుకున్న చోట్ల అస‌లు షూటింగ్‌ల‌కు అనుమ‌తులూ క‌ష్టంగా ఉంది. అలా అని ముందు చిన్నా చిత‌కా సీన్లు తీసేద్దాం.. ష‌ర‌తుల‌కు లోబడి షూటింగ్ చేద్దాం అంటే సుక్కు ఇష్ట‌ప‌డ‌ట్లేద‌ట‌. కొంత కాలం ఎదురు చూసి అయినా తాను అనుకున్న సీన్లే ముందు తీయాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు స‌మాచారం.