ప్రశంసలు బోలెడు.. మరి కలెక్షన్లు?

కొన్ని సినిమాల్ని విమర్శకులు చీల్చి చెండాడతారు. కానీ ఆ సినిమాలకు కలెక్షన్లు అదిరిపోతాయి. ఇంకొన్ని సినిమాలపై విమర్శకులు ప్రశంసల జల్లు కురిపిస్తారు. కానీ ఆ సినిమాలకు కలెక్షన్లు ఉండవు. రెండు వారాల కిందట వచ్చిన ‘నగరం’ సినిమా రెండో కోవకే చెందుతుంది. సందీప్ కిషన్, రెజీనా, శ్రీ ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించిన ఈ చిత్రం విడుదలకు ముందే పాజిటివ్ రివ్యూలు తెచ్చుకుంది.

తమిళంలో రిలీజ్‌కు నాలుగు రోజుల ముందే ప్రెస్ కోసం ప్రివ్యూ వేశారు. అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత తెలుగులోనూ విడుదలకు రెండు రోజుల ముందు ప్రివ్యూ వేశారు. ఇక్కడా ప్రశంసలు దక్కాయి. రిలీజ్‌కు ముందే మంచి మంచి రేటింగ్స్‌తో రివ్యూలు కూడా వచ్చాయి. విడుదల తర్వాత కూడా ప్రశంసలు కొనసాగాయి. కానీ ఈ రివ్యూలు.. ప్రశంసలకు తగ్గట్లుగా కలెక్షన్లు మాత్రం లేవు. ఫస్ట్ వీకెండ్లోనే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం.. ఆ తర్వాత బాక్సాఫీస్ రేసులో నిలవలేకపోయింది. తర్వాతి వారం వచ్చిన సినిమాలు తేలిపోయినా.. ‘నగరం’కు అది పెద్దగా కలిసిరాలేదు. ఆలోపే ఈ చిత్రం థియేటర్ల నుంచి లేచిపోయింది. అక్కడక్కడా సినిమా ఆడుతున్నా కలెక్షన్లు లేవు.

లేక లేక తన సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని.. హిట్టు కొట్టేశానని సంబరపడ్డ సందీప్ కిషన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. కాకపోతే అతడికి కొంత ఆనందం ఏంటంటే.. ఈ చిత్రం తమిళంలో మాత్రం బాగా ఆడుతోంది. కలెక్షన్లు రెండో వారంలోనూ స్టడీగానే ఉన్నాయి. అక్కడ ఈ చిత్రం హిట్ కేటగిరిలోకి చేరేలా ఉంది. తమిళంలో ఇంకో రెండు ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టిన సందీప్‌.. అక్కడైనా నిలదొక్కుకుంటాడేమో చూద్దాం.