సొంతింటిని దానం ఇచ్చేసిన హీరో సూర్య‌

రీల్ హీరోలు రియ‌ల్ హీరోలుగా అరుదుగా క‌నిపిస్తుంటారు. త‌మ‌ను అభిమానించి.. ఆరాధించే ప్ర‌జ‌ల‌కు ఏదైనా క‌ష్టం వ‌చ్చిందంటే.. సాయం చేసేందుకు తెగ ఆలోచించే హీరోల‌కు భిన్నంగా.. తాను పుట్టి పెరిగి.. ఎన్నో అనుభూతులు పెన‌వేసుకున్న సొంతింటిని ఒక మంచి ప‌ని కోసం హీరో సూర్య దానంగా ఇచ్చేసిన వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

సొంతిల్లు.. అందునా తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన ఇంటిని వ‌దులుకోవ‌టానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. ఇక‌.. ప్ర‌ముఖులైతే ఆ ఇంటిని అత్యంత జాగ్ర‌త్త‌గా ఉంచుతారు. కానీ.. స్టార్‌ హీరో సూర్య అందుకు పూర్తి భిన్నం. ఒక మంచి ప‌ని కోసం త‌న సెంటిమెంట్ల‌ను ప‌క్క‌న పెట్టేసి.. చారిటీ కోసం దానం ఇచ్చేశాడు.

చాలామంది హీరోల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే సూర్య‌.. అగ‌రం అనే ఫౌండేష‌న్‌ను కూడా న‌డుపుతున్న సంగ‌తి చాలామందికి తెలిసిందే. త‌న తండ్రి శివ‌కుమార్ క‌ట్టించిన ఇంట్లోనే సూర్య ఫ్యామిలీ ఉండేది. అయితే.. పెరుగుతున్న అవ‌స‌రాల‌కు ఆ ఇల్లు అనువుగా లేక‌పోవ‌టంతో ఈ మ‌ధ్య‌నే కొత్త ఇంటిని క‌ట్టించుకొని అందులోకి మారిపోయారు. అంతా బాగానే ఉంది కానీ.. ఖాళీ చేసిన పాత ఇంటిని ఏం చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన స‌మ‌యంలోనే చారిటీ కోసం ఆ ఇంటిని వినియోగించాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చారు సూర్య‌.

కోట్ల రూపాయిల విలువ చేసే ఇంటిని మ‌రోఆలోచ‌న లేకుండా.. స్వ‌చ్చంద సంస్థ‌కు దానం ఇచ్చేసిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇలాంటి రియ‌ల్ హీరోలు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో అతి కొద్ది మంది మాత్ర‌మే ఉంటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.