టాలీవుడ్‌పై పగ పట్టేసిన తాప్సి

అదేంటో సౌత్ సినిమాల్లో చేసినన్నాళ్లూ నోటికి తాళం వేసుకుని ఉండే ఉత్తరాది భామలు.. బాలీవుడ్ సినిమాలకు వెళ్లగానే చాలా బోల్డ్ అయిపోతుంటారు. ఇక్కడి సినిమాల గురించి.. ఇక్కడి ఇండస్ట్రీల గురించి తేలిక చేసి మాట్లాడేస్తుంటారు. ఇలియానా.. రాధికా ఆప్టే లాంటి హీరోయిన్లు సౌత్ గురించి తక్కువ చేసి మాట్లాడారు ఇంతకుముందు. తర్వాత తాప్సి కూడా ఈ కోవలోకే చేరింది. టాలీవుడ్లో తన టాలెంట్‌కు తగ్గ అవకాశాలు రాలేదని.. తనపై ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర వేశారని ఇంతకుముందు ఓసారి వాపోయిన తాప్సి తాజాగా మరోసారి తెలుగు సినీ పరిశ్రమపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది.

టాలీవుడ్‌లో సినిమా హిట్టయితే హీరోను హిట్ చేసిన ఘనుడిగా కీర్తిస్తారని.. కానీ సినిమా ప్లాప్ అయిపోతే దాన్ని హీరోయిన్లకు ఆపాదిస్తారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్లకు ‘ఐరెన్ లెగ్’ ట్యాగ్ తగిలించే సంప్రదాయం ఇక్కడుందని ఆమె వాపోయింది. ‘‘నేను పాకెట్ మనీ కోసం సరదాగా నటన వైపు వచ్చాను. ఊహించని విధంగా టాలీవుడ్‌లోకి ఎంటరయ్యాను. నేను పనిచేసిన మూడు సినిమాలు సరిగ్గా ఆడలేదు. అంతే నాపై ‘ఐరెన్ లెగ్’ ముద్రపడిపోయింది. అప్పట్నుంచి నన్ను సినిమాలో పెట్టుకోవడమే దురదృష్టం అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ మూడు సినిమాల్లోనూ పెద్ద డైరెక్టర్లు.. పెద్ద హీరోలు ఉన్నారు. కానీ వాటి వైఫల్యానికి నా దురదృష్టమే కారణమైపోయింది’’ అని తాప్సి ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి టాలీవుడ్ మీద తాప్సికి పీకల దాకా కోపం ఉన్నట్లుంది. అందుకే ఇక్కడ సినిమాలు మానేసి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ అనుభవాల్ని మరిచిపోలేక పోతున్నట్లుంది.