హైదరాబాద్ లో స్థలం చూపిస్తే ఇళ్లు కట్టిస్తాం.. భట్టికి మంత్రి తలసాని సవాల్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం జరిగడం.. మంత్రి తలసాని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లడం.. అక్కడి నుంచి జియాగూడలోని ఇళ్ళను పరిశీలించడం తెలిసిందే.

అయితే.. భట్టి వ్యాఖ్యలపై మంత్రి తలసాని మరోసారి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో స్థలాలు ఖాళీ లేనందునే నగర శివారులోని రాంపల్లిలో ఇళ్లు నిర్మించామన్నారు. హైదరాబాద్ లో ఖాళీ స్థలాలను భట్టి చూపిస్తే ఇళ్లు కట్టిస్తాం అని ఆయన సవాల్ విసిరారు.

ప్రజల కోసమే తాము ఇళ్లు కడుతున్నాం కానీ.. ప్రజల ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. భట్టికి అవసరమైతే లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లిస్ట్ పంపిస్తాం.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చుని చూసుకోవాలని అన్నారు. కొల్లూరులో ఎకరం కోట్లు విలువ చేస్తుందని.. ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా మీడియాపై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని. ఇళ్లపై మీడియాకి అంత అత్యుత్సాహం ఎందుకని ప్రశ్నించారు. ఇవి బిల్డింగ్ లు అనుకుంటున్నారా? మజాక్ అనుకుంటున్నారా..? అని మండిపడ్డారు.

కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లు కట్టిస్తున్నాం. అల్లావుద్దీన్ మ్యాజిక్ లా ఇళ్లు కట్టలేం. గడచిన 70 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఇళ్లు కట్టించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కట్టించిన చెత్త ఇళ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉచితంగా కట్టించిన ఇళ్లకు తేడా చూడాలన్నారు. కాంగ్రెస్ కట్టిన ఇళ్లును తీసుకునేందుకు ఎవరూ రావట్లేదన్నారు. బాధ్యత లేకుండా భట్టి మాట్లాడటం సరికాదన్నారు.