తమన్నా షాకిచ్చినా.. సినిమా ఆగలేదు

‘క్వీన్’ సినిమా సౌత్ రీమేక్ హక్కులు తీసుకున్న నిర్మాత త్యాగరాజన్.. దాన్ని పట్టాలెక్కించే విషయంలో రెండేళ్లకు పైగా నాన్చాడు. చివరికి తమిళ, తెలుగు భాషల్లో తమన్నా కథానాయికగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ తమన్నా భారీ పారితోషకంగా డిమాండ్ చేయడంతో ఈ సినిమాకు బ్రేక్ పడిపోయింది.

ఈ దెబ్బతో కన్నడ, మలయాళ రీమేక్ పనులు కూడా ఆగిపోయినట్లు వార్తలొచ్చాయి. దీంతో రీమేక్ కోసం త్యాగరాజన్ పెట్టిన పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరే అనుకున్నారంతా. కానీ ఈ సినిమాను తెరకెక్కించే విషయంలో చాలా పట్టుదలగా ఉన్న త్యాగరాజన్.. కన్నడ వరకు రీమేక్‌ను పట్టాలెక్కించేయడానికి సన్నాహాలు పూర్తి చేశాడు.

‘కిల్లింగ్ వీరప్పన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమున్న పారుల్ యాదవ్ కథానాయికగా కన్నడ ‘క్వీన్’ తెరకెక్కనుంది. కమల్ హాసన్‌కు ఆప్తమిత్రుడైన రమేష్ అరవింద్ (సతీలీలావతి ఫేమ్) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. కన్నడ వెర్షన్‌కు ‘బటర్ ఫ్లై’ అనే పేరు పెట్టారు. రమేష్ కమల్ హీరోగా ‘ఉత్తమ విలన్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

దీంతో పాటు ‘భలే భలే మగాడివోయ్’ కన్నడ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్టయింది. మరోవైపు మలయాళంలో అమలా పాల్ హీరోయిన్‌గా ‘క్వీన్’ను రీమేక్ చేయాలనుకుంటున్నాడు త్యాగరాజన్. రేవతి దర్శకత్వం వహించాల్సి ఉంది. ఐతే తెలుగు, తమిళ రీమేక్‌ల కోసం సరైన హీరోయిన్ దొరికాక మూడు భాషల్లో ఒకేసారి సినిమాను తెరకెక్కించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.