బాబు ప‌రిపాల‌న‌ను క‌డిగిపారేసిన టీడీపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌ తమ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో జరిరిగి అంబేడ్కర్ జయంతి సభలో పాల్గొన్న ఎంపీ శివప్రసాద్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అవ‌లంభిస్తున్న విధానాల‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

ఏపీ జనాభాలో 25 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు జరగాల్సిన న్యాయం జరగడంలేదని, ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉన్నా రెండు పదవులిచ్చి చేతులు దులుపుకొన్నార‌ని శివ‌ప్ర‌సాద్ మండిప‌డ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి రెండు మంత్రి పదవులు ఇస్తే వాటినీ ఓసీలకే ఇచ్చారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం బీసీలకు ఇచ్చారని, ఎస్సీ ఎస్టీలను మాత్రం దూరంగా పెడుతున్నారంటూ శివ‌ప్ర‌సాద్ దుయ్యబట్టారు.

మేనిఫెస్టోలో 90 శాతం హామీలు నెరవేర్చిన ట్టుగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ మిగిలిన 10శాతం హామీలు మాల, మాదిగలవి మాత్ర‌మే మిగిల్చిందో చెప్పాలంటూ శివ‌ప్ర‌సాద్‌ ప్రశ్నించారు. దళితులకు చెందిన భూములను లాక్కుంటే పట్టించుకోకపోవడం, పరిహారం ఇవ్వకపోవడం సమంజసం కాదని ఆయ‌న అన్నారు. ల్యాండ్ పూలింగ్ భూములు తీసుకుని భూ యజమానులను శ్రామికులుగా మారుస్తున్నారని, ప్రభుత్వ భూములు కబ్జా అయినా పట్టించుకోవట్లేదని ఏపీ స‌ర్కారు తీరుపై శివ‌ప్ర‌సాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. `క‌బ్జా అయిన‌ ఆ భూముల్లో దళితులుంటే ఖాళీ చేయాలని నోటీసులిస్తారు.

ఇదెక్కడి న్యాయం.. దళితులకో న్యాయం, పై వర్గాలకో న్యాయమా?. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు కట్ చేశారు. దళితులు ఉన్నత చదువులు చదువుకోవద్దా? బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలపాలి` అంటూ ` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దళితుల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లుతున్నాయని, చంద్రబాబు పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.