కొత్త సినిమాలకు కష్టమేనబ్బా..

గత రెండు వారాల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగా నడుస్తోంది. జనాల్ని థియేటర్లకు పరుగులు పెట్టించి సరైన సినిమాలు రావట్లేదు. గత వారం విడుదలైన ‘అమీతుమీ’ ఉన్నంతలో కాస్త పర్వాలేదు కానీ.. అది కూడా పూర్తి స్థాయిలో అలరించిన సినిమా ఏమీ కాదు. ఇక ఈ శుక్రవారం చూస్తే పరిస్థితి ఏమంత ఆశాజనకంగా కనిపించట్లేదు. వచ్చే వారం ‘దువ్వాడ జగన్నాథం’ విడుదల కానున్న నేపథ్యంలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావట్లేదు.

ఉన్నంతలో ‘కాదలి’ పరిస్థితి బెటర్. తన మిత్రుడు  పట్టాభి ఈ చిత్రాన్ని రూపొందించడం వల్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందుకొచ్చి ఈ సినిమాను ప్రమోట్ చేయడం.. రామ్ చరణ్ తో పాటు మరికొందరు తారలు కూడా ప్రమోషన్లో పాలుపంచుకోవడంతో ఈ సినిమా కొంచెం జనాల్లో నానింది. అయినప్పటికీ అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు థియేటర్లకు రప్పిస్తుందన్నది సందేహం.

ఇక తెలుగు కుర్రాడు ఆది పినిశిట్టి తమిళంలో నటించిన ‘మరకతమణి’ తెలుగులోనూ ఒకేరోజు విడుదలవుతోంది. ఐతే ఆదికి హీరోగా ఇక్కడ గుర్తింపు అంతంతమాత్రమే. ‘మరకతమణి’ అనే పేరే తమిళ వాసనలు కొడుతోంది. అంత ఆకర్షణీయంగా అనిపించట్లేదు. ఈ సినిమాకు ప్రమోషన్ కూడా పెద్దగా చేయలేదు. దీంతో జనాల్లో ఆసక్తి అంతంతమాత్రమే. మరోవైపు తారకరత్న విలన్ పాత్ర పోషించిన ‘రాజా మీరు కేక’ కూడా శుక్రవారమే విడుదలవుతోంది. దీని మీద అసలేమాత్రం అంచనాల్లేవు. మొత్తానికి ఈ శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర ఏమంత కళ ఉంటుందన్న ఆశల్లేవు. ఈ సినిమాల్లో దేనికైనా అదిరిపోయే టాక్ వచ్చి.. పరిస్థితి మారుతుందేమో చూడాలి.