త్రివిక్రమ్‌ మెగా స్కెచ్‌ ఇదే

పవన్‌కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ తీస్తోన్న చిత్రానికి నిర్మాత రాధాకృష్ణ అయినప్పటికీ ఫైనాన్షియల్‌ డీలింగ్స్‌ అన్నీ త్రివిక్రమ్‌ పర్యవేక్షణలో జరుగుతున్నాయట. ఇది త్రివిక్రమ్‌ సొంత బ్యానర్‌ లాంటిది కనుక ఎంత ఖర్చు పెట్టాలనేది ఆయనే డిసైడ్‌ చేస్తున్నాడట. ఈ చిత్రానికి పారితోషికాలతో కలిపి వంద కోట్ల బడ్జెట్‌ వేసి ఇచ్చాడట. ఈ వంద కోట్లు నిర్మాత తనకి ప్రొవైడ్‌ చేస్తే, ఇందులోనే టోటల్‌ ప్రాజెక్ట్‌ ఫినిష్‌ చేసి ఇస్తాడన్నమాట.

థియేట్రికల్‌ బిజినెస్‌తోనే పెట్టుబడి వచ్చేస్తుంది కనుక శాటిలైట్‌, వీడియో హక్కులు వగైరా మొత్తం నిర్మాత జేబులోకి వెళుతుందన్నమాట. వంద కోట్లు పెట్టినా నికరంగా పదిహేను కోట్ల లాభాన్ని అయితే త్రివిక్రమ్‌ పేపర్‌ మీద చూపించేసరికి అతను అడిగింది ఇవ్వడానికి నిర్మాత ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదట. ఇకపోతే ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎంతలో తియ్యాలి, ఏ లొకేషన్‌కి వెళ్లాలి వగైరా అన్నీ త్రివిక్రమ్‌ డిసైడ్‌ చేస్తున్నాడని భోగట్టా. ఇందులో ఇద్దరు యువ హీరోయిన్లని తీసుకోవడానికి కూడా కారణమదేనట. పవన్‌ సినిమా అనే సరికి వారికి డిమాండ్లు పెద్దగా వుండవు. మామూలుగా ఇద్దరు స్టార్‌ హీరోయిన్లని తీసుకుంటే కనీసం మూడు కోట్లు ఖర్చయిపోతాయి.

కానీ కీర్తి సురేష్‌, అను ఇద్దరికీ కలిపి యాభై లక్షల ప్యాకేజీతో సరిపోయిందని సమాచారం. ఇలానే పారితోషికాల పరంగా పవన్‌కి, తనకి తప్ప మిగతా వారికి ఎక్కువ వెళ్లకుండా త్రివిక్రమ్‌ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దీనిని లాభదాయక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నాడని తెలిసింది. త్రివిక్రమ్‌ లాంటి సమర్ధుడు, మార్కెట్‌ తెలిసినవాడు చేతిలో వుంటే ఇక ఆ నిర్మాతకి ఇంకేం కావాలి… హ్యాపీగా లాభాలు లెక్కేసుకోవడం తప్ప.