తిట్టిపోశారు.. రెండు క్రేజీ ప్రాజెక్టులొచ్చాయ్

‘కాటమరాయుడు’ సినిమాకు సంబంధించి అత్యంత విమర్శలు ఎదుర్కొన్నది సంగీత దర్శకుడు అనూప్ రూబెన్సే. పోయి పోయి ‘వీరం’ లాంటి రొటీన్ మాస్ మసాలా సినిమాను రీమేక్‌లో నటించాలని నిర్ణయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ను ఎవరూ ఏమీ అనలేదు. ఇది రీమేక్ కాబట్టి దర్శకుడైన డాలీని కూడా ఎవరూ నిందించలేదు.

కానీ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌ను మాత్రం అందరూ తిట్టిపోశారు. పవన్ సినిమాకు తగ్గ ఊపున్న మ్యూజిక్ ఇవ్వలేదని.. పాటలు తేలిపోయాయని.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎలివేట్ కాలేదని అతడిపై విమర్శలు గుప్పించారు. ఆడియో రిలీజైనపుడు.. ఆ తర్వాత సినిమా విడుదలపుడు అనూప్‌ను చాలామంది టార్గెట్ చేసుకున్నారు.

ఈ విమర్శల దాడి చూశాక అనూప్‌కు పెద్ద సినిమాల్లో అవకాశాలు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ కొన్ని రోజుల్లోనే రెండు క్రేజీ ప్రాజెక్టులకు సంతకం చేశాడు అనూప్. అందులో ఒకటి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కనున్న సినిమా. ఇంతకుముందు ఇష్క్, మనం సినిమాలకు అనూప్ నుంచి మంచి మ్యూజిక్ రాబట్టుకున్న విక్రమ్.. మళ్లీ అతడిపైనే నమ్మకం పెట్టాడు. మరోవైపు నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా అనూపే సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు సమాచారం.

ఇంతకుముందు పూరితో హార్ట్ ఎటాక్, టెంపర్ లాంటి సినిమాలకు పని చేశాడు అనూప్. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా పూరి అతడినే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమాకు అనూప్ సంగీతమందించబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.