అక్కుపక్షులు ఎన్టీఆర్‌కి స్క్రీన్‌ప్లే రాసేస్తున్నారు!

ఏదైనా వార్త బయటకి రావడం పాపం, ఇక దానిని పట్టుకుని కథలు అల్లుకుంటూ కూర్చోవడం నయా జర్నలిజమ్‌. సినిమా జర్నలిజమ్‌ అనేసరికి ఇక అథెంటిసిటీకి చోటు లేదన్నట్టు ఎవరికి తోచినట్టు వాళ్లు ఊహల్ని ప్రచారం చేసేస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ జీవిత కథతో సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించాడో లేదో ఇక ఆ సినిమాలో ఏ సన్నివేశాలుంటాయి, వాళ్లని హీరోగా చూపిస్తారు, వాళ్లని విలన్‌గా చూపిస్తున్నారంటూ స్టోరీలు అల్లేస్తున్నారు.

చంద్రబాబుతో బాలకృష్ణ వియ్యం అందుకున్నారు కనుక ఇక ఎన్టీఆర్‌ జీవిత కథలో వెన్నుపోటు ఘట్టం వుండదని, కేవలం ఎన్టీఆర్‌ రాజకీయ ఎదుగుదలలో చంద్రబాబు పోషించిన పాత్రని హైలైట్‌ చేస్తూ హీరోలా చూపిస్తున్నారని రాసేస్తున్నారు. అంతే కాదు దీనికి అప్పుడే లక్ష్మిపార్వతి అడ్డు తగలడం, చంద్రబాబుని హీరోగా చూపిస్తే సహించననడం!

అసలు ఎన్టీఆర్‌ జీవిత కథని సినిమాగా తీస్తే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి? అది స్క్రీన్‌ప్లే రచయితల పని. నిజ జీవిత కథ అయినా, కల్పిత కథ అయినా పతాక సన్నివేశం బ్రహ్మాండంగా వుండాలి. ఎన్టీఆర్‌ జీవితంలో అలాంటి ఘట్టం 1983లో విజేతగా నిలవడం. ఆ పార్ట్‌తోనే ముగించాలని ఏ రచయిత అయినా అనుకుంటాడు.

జీవిత కథ అంటే పుట్టుక నుంచి మరణం వరకు అన్నీ చూపించాల్సిన పని లేదు. అలా తీస్తే అదో డాక్యుమెంటరీ అవుతుంది. ఇదంతా పట్టనట్టు ఎన్టీఆర్‌ కథ సినిమా తీస్తే ఈ సీన్‌ ఏం చేస్తారు, ఆ ఘట్టం ఎలా తెరకెక్కిస్తారంటూ చర్చ ఏంటి కామెడీ కాకపోతే! ఇలా తెలిసీ తెలియని కూతలు కూసే వాళ్లనే అక్కుపక్షులుగా అభివర్ణించాడు నాగబాబు.