బ్యాన్ యువి క్రియేషన్స్

ఫ్యాన్స్ తో మజాకా కాదు. వాళ్లకు వాళ్ల హీరో తప్ప మరేం పట్టదు. తమ అంచనాలు అందుకోకుంటే ఒక్కోసారి హీరో మీదే తిరగబడతారు. హీరో పీఆర్వోలను పట్టుకుని నానా యాగీ చేస్తారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఫ్యాన్స్ సంగతులు. ఇప్పుడు ఫ్యాన్స్ కోపానికి యువి క్రియేషన్స్ సంస్థ గురయింది. ప్రభాస్ కు భాగస్వామ్యం వున్న సంస్థ. ప్రభాస్ మిత్రుల సంస్థ. అయినా కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆ సంస్థనే టార్గెట్ చేసారు.

బ్యాన్ యువి క్రియేషన్స్ అనే హ్యాష్ టాగ్ ను ట్విట్టర్ లో ట్రెండింగ్ చేసారు. దాదాపు నలభై వేల ట్వీట్లు వేసారు. బాహుబలి లాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ తరువాత ప్రభాస్ ప్లాన్ చేసిన రెండు సినిమాలు యువి క్రియేషన్స్ బ్యానర్ లోనే. సాహో సినిమా అంచనాలు ఓ రేంజ్ లోకి వెళ్లాయి. కానీ చాలా దారుణమైన అవుట్ పుట్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడలేని పరిస్థితికి తీసుకువచ్చింది.

ఆ తరువాత అయినా ప్రభాస్ చకచకా సినిమా చేసి అందిస్తాడనుకుంటే మళ్లీ యువి బ్యానర్ లోనే రాథేశ్వామ్ సినిమా చేస్తున్నాడు. దీనికీ ఇప్పటి వరకు అప్ డేట్ లు లేవు. ఫ్యాన్స్ సమస్య ఏమిటంటే, సినిమా ఎప్పుడు వస్తుందన్నది కాదు. ఎప్పటికప్పుడు ఆ సినిమా గురించి ఓ సమాచారం, ఓ స్టిల్, ఓ న్యూస్ కోరుకుంటారు.

యువి క్రియేషన్స్ ఇక్కడే ఫెయిల్ అవుతోంది. సాహోలో అన్ని స్టిల్స్ పెట్టుకుని, విడుదల చేయుకుండా దాచుకున్నారు. ముంబాయి టీమ్ కు పబ్లిసిటీ అప్పగించి, వాళ్లు చూసుకుంటారు అనుకున్నారు. తెలుగు నాట ఒక్క స్టిల్ వదలలేదు. సినిమా విడుదలయ్యాక బోలెడు వచ్చాయి. ఏం లాభం?

ఇప్పుడు రాథేశ్వామ్ వ్యవహారం కూడా అలాగే వుంది. పవన్ కళ్యాణ్ లుక్ వచ్చింది. బన్నీ లుక్ వస్తోంది. రామ్ చరణ్ లుక్ వచ్చింది. ప్రభాస్ ది మాత్రం రాలేదు. దాంతో ఫ్యాన్స్ కు చిర్రెత్తుకు వచ్చింది. బ్యాన్ యువి క్రియేషన్స్ అంటూ ట్విట్టర్ లో హల్ చల్ మొదలెట్టారు. కానీ యువి క్రియేషన్స్ ఇవన్నీ పట్టించుకుంటుందనే ఆశ మాత్రం లేదు. వాళ్ల స్టయిల్ వేరు.